తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tollywood drugs case Update : మరోసారి తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్​ కేసు.. అబ్కారీ శాఖకు ఈడీ లేఖ..

Tollywood drugs case Update , drugs case in Tollywood
మరోసారి తెరమీదకు టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు

By

Published : Feb 11, 2022, 11:19 AM IST

Updated : Feb 11, 2022, 6:11 PM IST

11:14 February 11

మరోసారి తెరమీదకు టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు

Tollywood drugs case Update: టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ అబ్కారీ శాఖాధికారులకు ఈడీ అధికారులు లేఖ రాశారు. సాక్షులు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు సంబందించిన వివరాలతో పాటు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖలో కోరారు. గతేడాది సెప్టెంబర్​లో ఈడీ అధికారులు టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. టాలీవుడ్​కు చెందిన 12 మందిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. వాళ్ల బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు.

ఇటీవలే ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నిసార్లు అడిగినా రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇటీవలే హైకోర్టుకు ఫిర్యాదుచేశారు. ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు చెందిన పూర్తివివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు సంస్థలు సమర్పించిన పత్రాలను ఈడీకి ఇవ్వాలని స్థానిక కోర్టులను... ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు అబ్కారీ అధికారులకు లేఖ రాశారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆధారాలను బట్టి ఈడీ అధికారులు మరోసారి కొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ పిల్

TPCC Chief Revanth PIL: కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టుకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఇటీవలే ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసును ఈడీ, సీబీఐ, ఎన్​సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని 2017లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ఈనెల 2న మరోసారి విచారణ జరిపింది. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న డ్రగ్స్ కేసులను రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సమర్థంగా విచారణ జరపడం లేదని.. కేంద్ర సంస్థలకు అప్పగించాలని రేవంత్ తరఫున న్యాయవాది రచనారెడ్డి కోరారు. తమకు అవసరమైన దస్త్రాలు, సమర్పించేలా ఎక్సైజ్ శాఖను ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ఆన్​లైన్ విచారణలో నేరుగా కోర్టుకు వివరించారు. తాము అడిగిన వివరాలను ఎక్సైజ్ శాఖ ఇవ్వడం లేదని.. కోర్టు నుంచి తీసుకోవాలని చెబుతోందని ఈడీ జేడీ తెలిపారు. మరోవైపు తాము కోరుతున్న దస్త్రాలు లేవని.. దర్యాప్తు అధికారులు సమర్పించలేదని విచారణ కోర్టులు చెబుతున్నాయని అభిషేక్ గోయల్ వివరించారు. ఎఫ్ఐఆర్​లు, ఛార్జ్ షీట్లు, తమ వద్ద ఇతర దస్త్రాలన్నీ ఈడీకి ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు.

హైకోర్టు ఆదేశాలు

TS High court on Tollywood drugs case : వాదనలు విన్న హైకోర్టు.. ఈడీకి వివరాలు ఇవ్వకపోవడం తగదని.. విచారణకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మాదకద్రవ్యాలు యువతను అతలాకుతలం చేస్తున్నాయని.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్​ఫోర్స్​ మెంట్ డైరెక్టరేట్​కు సహకరించాలని తెలిపింది. డ్రగ్స్ కేసు విచారణకు ఈడీ సరైన సంస్థేనని అభిప్రాయపడింది. . ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసుతో ప్రమేయం ఉన్న వారి కాల్ డేటా సహా అన్ని వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్​కు నెల రోజుల్లో అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. ఈడీ దరఖాస్తు చేస్తే తమ వద్ద సమాచారం, పత్రాలు ఇవ్వాలని డ్రగ్స్ కేసులను విచారణ చేస్తున్న కోర్టులను కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తమ ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. దర్యాప్తునకు అవసరమైన వివరాలు, దస్త్రాలు ఇవ్వకపోతే.. మళ్లీ తమను సంప్రదించవచ్చునని ఈడీకి హైకోర్టు సూచించింది. ఇప్పటికే ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నందున... ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు కేసును అప్పగించాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి పిల్​పై విచారణను ముగించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. డిజిటల్ రికార్డులు, కాల్‌డేటా వివరాలు ఇవ్వాలని ఆబ్కారీశాఖకు ఈడీ లేఖ రాసింది.

ఇదీ చదవండి:TOLLYWOOD DRUGS CASE: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేస్తారా..?

Last Updated : Feb 11, 2022, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details