తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tollywood Drugs Case: మత్తుమందు లావాదేవీల గుట్టు రట్టే లక్ష్యం

నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్ కేసులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది.

Tollywood Drugs Case
మాదకద్రవ్యాల కేసు

By

Published : Aug 27, 2021, 8:09 AM IST

ప్రధానంగా నిధుల అక్రమ మళ్లింపు నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి వచ్చే కేసులను మాత్రమే విచారణ జరిపే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) టాలీవుడ్‌ మత్తుమందుల కేసుపై దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పైగా నాలుగేళ్ల నాటి కేసును దుమ్ము దులిపి మరీ కొత్తగా నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. మాదకద్రవ్యాల సరఫరా, వాడకంపై రాష్ట్ర ఆబ్కారీశాఖ దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేయగా.. తాజాగా నిధుల మళ్లింపు గుట్టు రట్టు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. మత్తుమందులను దిగుమతి చేసుకునేందుకు విదేశాలకు నిధులు ఎలా మళ్లించారో నిర్ధారించేందుకు నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 12 మంది తెలుగు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.

2017లో వెలుగులోకి..

2017 జులైలో రాష్ట్ర ఆబ్కారీశాఖ కెల్విన్‌ మాస్కరెన్హాస్‌తోపాటు మరో ఇద్దర్ని పట్టుకున్నప్పుడు ఈ మత్తుమందుల బాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే ఈ ముఠా నుంచి రూ.30 లక్షల విలువైన మత్తుమందులను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి మత్తుమందులు సరఫరా చేసేవాడినని కెల్విన్‌ వెల్లడించడంతో కలకలం మొదలైంది. అతడు చెప్పిన పేర్ల ఆధారంగా సినీ ప్రముఖులను విచారించారు. వారిపై సరైన ఆధారాలు లభించలేదని ఆబ్కారీశాఖ తన అభియోగపత్రంలో పేర్కొంది.

ఇదీ చూడండి:'మత్తు' వదలరా.. మకిలీ పట్టకురా..

బిట్‌కాయిన్లలో చెల్లించి.. కొరియర్‌లో రప్పించి

మత్తుమందుల వ్యాపారం రూ.కోట్లలో ఉంటుంది. గంజాయి వంటివి స్థానికంగా దొరుకుతాయి. ఎల్‌ఎస్డీ, కొకైన్‌, హెరాయిన్‌ వంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గ్రాము కొకైన్‌ విలువ దాదాపు రూ.10 వేలు ఉంటుంది. కెల్విన్‌ ముఠా పట్టుబడ్డప్పుడు అమెరికాలోని షికాగోలో ఉన్న అంతర్జాతీయ మత్తుమందుల ముఠాతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే మత్తుమందులు దిగుమతి చేసుకున్నట్లు తేలింది. డార్క్‌ వెబ్‌ ద్వారా ఆర్డర్‌ ఇచ్చి, అంతర్జాలం ద్వారా చెల్లింపులు జరిపేవారని, ఆ తర్వాత కొరియర్‌లో మత్తుమందులు వచ్చేవని వెల్లడైంది. ఆస్ట్రియా, దక్షిణాఫ్రికాల నుంచి కూడా వచ్చేవి. మూడు ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలతోపాటు తపాలా ద్వారా కూడా అందేవన్న విషయం బయటపడింది. వాటికి చెల్లింపులు ఎక్కువగా బిట్‌కాయిన్ల రూపంలోనే జరిగేవని తేలింది. ఆబ్కారీశాఖ కేవలం మత్తుమందుల సరఫరా, వినియోగం వరకే పరిమితమైంది. మత్తుమందుల కొనుగోలుకు విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు, ఎలా చెల్లించారు, ఆ డబ్బంతా ఎక్కడిది వంటి అంశాలపై దృష్టి సారించేందుకే ఈడీ అధికారులు కేసుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:alprazolam seized: భారీగా మత్తు పదార్థాలు పట్టివేత

drugs: పొట్టలో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌

ABOUT THE AUTHOR

...view details