తెలంగాణ

telangana

ETV Bharat / crime

మత్తుమందు రవాణ విదేశీ నిందితులను పట్టించుకోని ఆ దేశాల రాయబార కార్యాలయాలు

కోట్ల విలువైన మత్తుమందుల రవాణా కేసుల్లో అసలు నిందితులు దొరకరు.. అరెస్టయిన కొసరు నిందితులను ఎవరూ పట్టించుకోరు..ఈ పరిస్థితి గత మూడు నెలల్లో శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్టయిన నలుగురు విదేశీయుల విషయంలో జరుగుతుంది. వీరి విషయంలో ఆ దేశాల రాయబార కార్యాలయాలు మౌనంగా ఉంటున్నాయి. వారి తరఫున బెయిల్‌కు దరఖాస్తు చేసేవారే లేకుండా పోయారు.

Embassies of those countries that ignore foreign suspects arrested in drug trafficking
మత్తుమందు రవాణ విదేశీ నిందితులను పట్టించుకోని రాయబార కార్యాలయాలు

By

Published : Sep 7, 2021, 12:16 PM IST

ఈ నలుగురు నిందితులకు ఇప్పట్లో ఉపశమనం కలిగే అవకాశం కనిపించడం లేదు. దర్యాప్తు సంస్థ అభియోగపత్రాలు దాఖలు చేసి, న్యాయ విచారణ పూర్తి చేస్తేనే వీరి భవిష్యత్తు ఏంటనేది తెలియనుంది. మానవతా దృక్పథంతో కేసుని కొట్టేసిన భారత ప్రభుత్వమే నిందితులను వారి దేశాలకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ శిక్ష పడితే అది పూర్తయ్యాక మన ప్రభుత్వమే కల్పించుకోవాల్సి ఉంటుంది. విచారణ పూర్తికావడానికి కనీసం రెండు మూడేళ్లయినా పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ వీరు మన జైళ్లలో మగ్గాల్సిందేనా?

డబ్బులు ఆశపడి...

ఆఫ్రికా దేశాల నుంచి హెరాయిన్‌ సరఫరా చేస్తూ జూన్‌ 5, 6, జులై 19 తేదీల్లో ఉగాండ, జాంబియా దేశాలకు చెందిన జూలియా బ్రెండా, కారోల్, మరో మహిళ అరెస్టయ్యారు. జూన్‌ 21న టాంజానియాకు చెందిన జాన్‌ విలియమ్స్‌ అనే వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది అరెస్టు చేశారు. వీరంతా వారి దేశాల్లో ఫుట్‌పాత్‌ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించేవారని, డబ్బుకు ఆశపడి మత్తుమందుల రవాణాకు ఒప్పుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. డ్రగ్స్‌ ఇచ్చిన వారు, హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత వీటిని తీసుకోవాల్సిన వారు ఎవరో వీరికి తెలియదు.

అసలు సూత్రధారులెవరు..?

అంతర్జాతీయస్థాయిలో మత్తుమందుల రవాణా ఇలానే జరుగుతుంది. అమాయకులకు డబ్బు ఎరవేసి మత్తు మందులు రవాణా చేయిస్తుంటారు. ఒకవేళ వీరు దొరికినా అసలు సూత్రధారుల వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ నలుగురి విషయంలోనూ అలానే జరిగింది.

ఆ దేశాల అధికారులెక్కడ..?

విదేశీయులు ఎవరైనా నేరం చేసి పట్టుబడితే వారి పాస్‌పోర్ట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఆ దేశ రాయబార కార్యాలయానికి మన అధికారులు సమాచారం ఇస్తారు. తద్వారా వారు తమ దేశ పౌరులకు అవసరమైన న్యాయసాయం చేయడంతోపాటు నేరం తీవ్రతను బట్టి వీలైతే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిందితులను తమ దేశానికి తరలిస్తుంటారు. మత్తుమందులు సరఫరా చేస్తూ పట్టుబడటంతో ఈ నలుగురి విషయంలో వారి దేశాల రాయబార కార్యాలయాల నుంచి ఎలాంటి స్పందన లేదని మన పోలీసు అధికారులు తెలిపారు. సైబర్‌ నేరాల కేసుల్లో పట్టుబడ్డ నిందితులను పోలీసులే బలవంతంగా వారి దేశానికి (డిపోర్టేషన్‌) పంపుతున్నారు. మత్తుమందుల కేసులో ఆ అవకాశం కూడా లేదు. వారి రాయబార కార్యాలయాలు స్పందిస్తే తప్ప వేరే మార్గం లేదు.

విచారణ పూర్తయ్యే వరకూ తమ పర్యవేక్షణలో ఉంచుకుంటామని హామీ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో అయినా బెయిల్‌ ఇప్పించడానికి అవకాశం ఉంది. కానీ ఈ నలుగురి విషయంలో ఆయా దేశాల రాయబార కార్యాలయాల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:

చంకలో చిన్నారిని కాటేసిన పాము..ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృత్యువాత

ABOUT THE AUTHOR

...view details