Electric bike Battery Blast : పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో వినియోగిస్తున్న ఎలక్టిక్ బైక్ వారి ప్రాణాలమీదకు తెచ్చింది. ఒకే కుటుంబంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే జిల్లాలో అనతి కాలంలోనే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అసలేం జరిగింది.. ఇది ఎక్కడంటే..
ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి.. ఎక్కడో కాదు మన దగ్గరే.! - electric bike explosion in nizamabad
12:35 April 20
Electric bike Battery Blast : ఛార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్రిక్ బైక్ బ్యాటరీ
నిజామాబాద్ నగరంలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్లో మంగళవారం రాత్రి జరిగింది. ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ బైక్కు సంబంధించిన బ్యాటరీని రోజు లాగానే అర్ధరాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టి పడుకున్న కొన్ని గంటల్లోనే అది పేలిపోయింది. ఘటనలో ఇల్లంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇంట్లోని మిగతా విద్యుత్ ఉపకరణాలకు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.
ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ఇంటి సభ్యుల్లో వృద్ధుడు రామస్వామి(80) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని భార్య కమలమ్మకు సైతం తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా కాలిన గాయాలతో ఉన్న కోడలు, మనుమడికి కమలమ్మతో పాటు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఇంట్లో ఐదుగురు ఉండగా మృతుడి కుమారుడు ప్రకాశ్ సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల నందిపేట్ మండలంలో విద్యుత్ ద్విచక్ర వాహనం కూడా ఇలాగే కాలిపోయింది.
ఇవీ చదవండి :'కేజీఎఫ్' థియేటర్లో.. కాలు తాకిందని కాల్చేశాడు..