విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఎనిమిదేళ్ల బాలుడికి ప్రాణాపాయ పరిస్థితిని తీసుకొచ్చింది. ట్రాన్స్ఫార్మర్కు తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం దానికి తాకిన పిల్లాడికి తీవ్రగాయాలయ్యాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడి నరకయాతనను కళ్లారా చూడలేక.. బాగుచేసుకొనే ఆర్థిక స్తోమత లేక కన్నీటిపర్యంతమవుతోంది ఆ మాతృమూర్తి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి ఈస్ట్ మారుతినగర్లోని ఎమ్మార్ హోమ్స్ అపార్ట్మెంట్లో.. జానకి.. తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటోంది. అందులో ఎనిమిదేళ్ల నిశాంత్.. శనివారం మధ్నాహ్నం ఆడుకునేందుకు అపార్ట్మెంట్లోని ఖాళీ స్థలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తాకి తీవ్రగాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు 48 గడిస్తేనే ఆరోగ్య స్థితిపై స్పష్టత ఇవ్వగలుగుతామని చెప్పారంటూ ఆ బాలుడు తల్లి కన్నీటిపర్యంతం అయింది. తనలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావొద్దని.. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. బాలుడు తల్లి జానికి ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
'శనివారం మధ్యాహ్నం ఆదుకుంటానంటా బయటకు వెళ్లాడు. అపార్ట్మెంట్ బయట రోడ్డుకు ఆనుకొని ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ప్రమాదవశాత్తు దానికి తాకి తీవ్రగాయాలపాలయ్యాడు. నా పిల్లాడికి జరిగినట్లు ఇంకెవరికీ జరగొద్దు. అధికారులు తక్షణమే.. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటుచేయాలి. తన బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాబు తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుడిని కాపాడుకొనేందుకు నా ఆర్థిక స్తోమత సరిపోదు. దాతలు ఎవరైన ఆదుకుంటేనే బాబును కాపాడుకోగలను.'