విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పట్టభద్రులు మన దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. పశ్చిమబెంగాల్‌కు చెందిన మహిళ(41) ప్రస్తుతం కొండాపూర్‌లో ఉంటోంది. 2011లో విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని స్వదేశానికొచ్చింది. పలుమార్లు ఎఫ్‌ఎంజీఈ పరీక్షలకు హాజరైనా ఉత్తీర్ణత కాలేదు.
ఈ క్రమంలోనే బాధితురాలి సోదరికి ఓరోజు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ కనిపించింది. ‘బిస్వజిత్ ఝా’ అనే స్వామిజీ పూజ చేస్తే చాలూ.. ఎలాంటి పరీక్షయినా తేలిగ్గా గట్టెక్కొచ్చని అందులో ఉంది. వెంటనే ఆమె ఆ స్వామిజీ ఫేస్‌బుక్ ఖాతాను వెతికి పట్టుకుని.. మెసేజ్ పెట్టింది. అటువైపు నుంచి వెంటనే స్పందన వచ్చింది. తన సోదరి పడుతున్న ఇబ్బంది గురించి వివరించింది. జాతక దోషాలున్నాయని.. అందుకే ఇలా జరుగుతుందంటూ స్వామిజీ ఆమెకు వివరించాడు. ఆమెకు నమ్మకం కుదరడంతో తన సోదరి నంబర్ స్వామీజికి ఇచ్చింది.
ఎక్కడో లోపమంటూ రెండోసారి..
స్వామీజీ శిష్యులు బాధితురాలిని సంప్రందించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆమె హాల్ టికెట్ ఫొటో తీసి వాట్సాప్‌లో పంపించింది. పూజ చేయాలంటే కొంత ఖర్చవుతుందని నమ్మించారు. ఆమె రూ.21,500 ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన పరీక్షలో పాస్ కాలేదు. ఇలా ఎందుకు జరిగిందంటూ స్వామిజీని అడిగింది. ఎక్కడో పూజలో లోపం జరిగిందంటూ నమ్మబలికాడు.