ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు - MP Nama Nageswara Rao latest news

11:54 June 11
ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు
తెరాస లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై మనీలాండరింగ్ అభియోగాలతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ ఉదయం నుంచి నామాతో పాటు రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిడెట్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కెనరాబ్యాంకు కన్సార్టియం నుంచి సుమారు వెయ్యి కోట్ల రూపాయల రుణాలు పొంది... నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని అభియోగం. జార్ఖండ్లో రాంచీ నుంచి జంషెడ్ పూర్ వరకు 1,151 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టును మధుకాన్ ప్రాజెక్ట్స్ 2011లో దక్కించుకుంది.
ప్రాజెక్టు నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవేకు బదిలీ అయిన నిధులతో పాటు.. ఆ సంస్థ పేరిట బ్యాంకుల నుంచి పొందిన రుణాలను ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ.. ఎస్ఎఫ్ఐఓలు దర్యాప్తు జరిపాయి. సీబీఐ అభియోగపత్రం ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసి.. ఇవాళ సోదాలు చేపట్టింది. సోదాల్లో పలు దస్త్రాలు, హార్డ్ డిస్కులు, అకౌంట్ల పుస్తకాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మళ్లించిన నిధులతో సమకూర్చుకున్న ఆస్తులు, షేర్లు, ఎఫ్డీలను గుర్తించే దిశగా ఈడీ విచారణ జరుపుతోంది.