తెలంగాణ

telangana

ETV Bharat / crime

Delhi Liquor Scam: దిల్లీ టు హైదరాబాద్... ఆగని ఈడీ సోదాలు - Delhi Liquor Scam Updates

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాల పరంపర కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు విడతలుగా సోదాలు జరగ్గా..శుక్రవారం మరో విడత ప్రారంభమవడంతో కలకలం రేగింది.

Delhi Liquor Scam
Delhi Liquor Scam

By

Published : Oct 8, 2022, 6:46 AM IST

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాల పరంపర కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు విడతలుగా సోదాలు జరగ్గా.. శుక్రవారం మరో విడత ప్రారంభమవడంతో కలకలం రేగింది. దిల్లీ ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ శుక్రవారం దేశంలోని 35 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ కేసులోని నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మద్యం పంపిణీదారులు, కంపెనీలు, ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న సంస్థల్లో సోదాలు జరిపింది.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లోనూ ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానిక కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరిన అయిదు బృందాలు రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగించాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సమీపంలోని ఓ ఆంగ్ల మీడియా సంస్థలో తనిఖీలు జరిపాయి.

లిక్కర్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయినపల్లి అభిషేక్‌ బ్యాంకు ఖాతా నుంచి మీడియా సంస్థ ఖాతాకు నగదు బదిలీ జరిగినట్లు గుర్తించిన క్రమంలోనే సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సదరు సంస్థ ‘నిర్వహణ పేరుతో’ ఆ సొమ్మును వినియోగించినట్లు ఈడీ గుర్తించి, మనీలాండరింగ్‌ కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం ఓ బృందం గచ్చిబౌలిలోని ఆ సంస్థ నిర్వాహకుడి ఇంట్లోనూ సోదాలు జరిపింది. రెండుచోట్ల కీలక పత్రాలను, డిజిటల్‌ ఆధారాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

బుచ్చిబాబు వద్ద దొరికిన సమాచారంతోనే?హైదరాబాద్‌ గోరంట్ల అసోసియేట్స్‌ సంస్థ కార్యాలయం, దాని నిర్వాహకుడు బుచ్చిబాబు ఇంట్లో గతంలో తనిఖీలు జరిగాయి. అక్కడ స్వాధీనం చేసుకున్న దస్త్రాల్లో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం బహిర్గతమైందని, వాటి గుట్టు తేల్చేందుకే తాజాగా సోదాలు జరిగినట్టు సమాచారం. అసలు మీడియా సంస్థలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమేమిటి? ఆ డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చారు? నష్టాల్లో ఉన్నట్లుగా చెబుతున్న ఆ సంస్థలో పెట్టుబడుల వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందా? అనే అంశాలను ఈడీ విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

విజయ్‌నాయర్‌ ఇచ్చిన ఆధారాలతోనూఈ కేసులో ఇప్పటికే దిల్లీకి చెందిన మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్రుతో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి విజయ్‌నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ కస్టడీ అనంతరం గురువారమే విజయ్‌నాయర్‌ను తిరిగి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. సీబీఐ ఆయన్ను విచారించినప్పుడు లభించిన కీలక సమాచారం ఆధారంగానూ తాజా సోదాలు జరిగి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.

తదుపరి అరెస్టులు ఇక్కడేనా?ఈ కుంభకోణానికి హైదరాబాద్‌ నుంచే బీజం పడిందనే ఆరోపణలు ముందు నుంచీ బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సీబీఐ నగరంలో ఎవరినీ అరెస్టు చేయలేదు. తాజా సోదాల నేపథ్యంలో తదుపరి అరెస్టులు ఇక్కడి నుంచే ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. ఆయన సంస్థలు, ఇంట్లో గతంలో ఈడీ సోదాలు జరిగాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు లేకున్నప్పటికీ ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు భాగస్వాములుగా ఉన్న సంస్థల్లోనూ తనిఖీలు జరిగాయి. మొత్తంగా హైదరాబాద్‌లోనే ఆర్థిక మూలాలు ముడిపడి ఉన్నట్లుగా ఈడీ దాదాపు నిర్ధారణకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details