తెలంగాణ

telangana

ETV Bharat / crime

దూకుడు పెంచిన ఈడీ.. రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరిపై దర్యాప్తు - ED searches in Mahbubabad

Delhi liquor scam: దిల్లీ మద్యంకుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్రానికి చెందిన పలువురిని విచారిస్తున్న ఈడీ దూకుడు పెంచింది. రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరిపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన కేసు వ్యవహారం మహబూబాబాద్‌కి విస్తరించడం సంచలనం సృష్టిస్తోంది.

ED officials
ED officials

By

Published : Oct 21, 2022, 6:50 AM IST

Updated : Oct 21, 2022, 9:15 AM IST

దూకుడు పెంచిన ఈడీ.. రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరిపై దర్యాప్తు

Delhi liquor scam: సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోన్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ కొనసాగుతోంది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటికే హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌పై గురి పెట్టిన ఈడీ తాజాగా మహబూబాబాద్‌పై దృష్టిసారించింది.

మహబూబాబాద్‌కి చెందిన ఇద్దరు యువకుల ఆర్ధిక లావాదేవీలపై ప్రస్తుతం ఈడీ ఆరాతీస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ప్రజాప్రతినిధికి సదరు యువకులు అనుచరులుగా చెబుతున్నారు. ప్రజాప్రతినిధికి ఒకరు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుండగా మరొకరు వ్యక్తిగత కార్యదర్శికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఆర్ధిక లావాదేవీల గురించి ఆరా తీసినట్టు సమాచారం. ప్రజా ప్రతినిధి వ్యక్తిగత కార్యదర్శి గతంలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌కు డబ్బులు ఎలా వచ్చాయనే అంశంపై ఆరా తీసినట్టు సమాచారం. అతను అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. తమ ఎదుట హాజరు కావాలని అతనికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ బ్యాంకు ఖాతాలోని ఆర్ధిక లావాదేవీలపై ఆరా తీసినట్టు సమాచారం.

ప్రజాప్రతినిధికి వీరిద్దరు బినామీలుగా వ్యవహరించినట్టు ఈడీ అనుమానిస్తోంది. మద్యం కుంభకోణంలో కేసులో ప్రముఖులకు ఆడిటర్‌గా ఉన్న గోరంట్ల అసోసియేట్స్‌ సంస్థతో పాటు రామచంద్రపిళ్లై నివాసంలో జరిగిన సోదాల్లోనే తీగ లాగితే డొంక కదిలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్రజాప్రతినిధికి అనుచరుడిగా చెబుతున్న బోయిన్‌పల్లి అభిషేక్‌రావు అరెస్టు చేసి విచారించింది. మహబూబాబాద్‌లో దర్యాప్తు సంస్థ విచారణ కలకలం రేపుతోంది. ఈడీ దూకుడుతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 21, 2022, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details