కార్వీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్- ఈడీ (ENFORCEMENT DIRECTORATE INVESTIGATION ON KARVY SCAM) లోతుగా దర్యాప్తు చేస్తోంది. స్టాక్ మార్కెట్ లావాదేవీల నిర్వహణ నెపంతో వినియోగదారులకు సంబంధించిన షేర్లను వారికి తెలియకుండానే బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు సెబీకి ఫిర్యాదులు రావడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో బ్యాంకుల తనఖాలో ఉన్న షేర్లను విడిపించి వినియోగదారులకు ఇప్పించేలా సెబీ చర్యలు తీసుకోవడంతో తాము మోసపోయామంటూ పలు బ్యాంకులు.. హైదరాబాద్ సీసీఎస్, సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసులు నమోదయ్యాయి.
నిధుల మళ్లింపుపై లోతైన విచారణ..
ఈ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ (ENFORCEMENT DIRECTORATE) కార్వీ నిర్వాహకుల నిధుల మళ్లింపు అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. వినియోగదారుల షేర్లను అక్రమంగా బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణంగా తీసుకున్న రూ.కోట్ల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే కేఎస్ఎల్ సంస్థ నిర్వాహకుల కనుసన్నల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలను ఆరా తీస్తోంది. మరోవైపు దాదాపు 40 కంపెనీలతోపాటు కొన్ని స్టాక్ ట్రేడింగ్ సంస్థలపైనా ఈడీ కన్నేసింది. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీల గుట్టు తేల్చడంలో నిమగ్నమైంది. మరోవైపు కార్వీ అక్రమాలపై ఇప్పటికే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించడంపై ఈడీ దృష్టి సారించినట్లు తెలిసింది.
ఆ వివరాలు దొరికితే..
ఎస్ఎవో ఇప్పటికే కేఎస్ఎల్ ఆధీనంలోని సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రూ .5 లక్షలకన్నా ఎక్కువగా జరిగిన లావాదేవీల గురించి సమాచారం సేకరించడంతో ఆ వివరాలు తెప్పించుకొనేందుకు ఈడీ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఆ సమాచారం అందితే ఈడీ దర్యాప్తులో కీలక పురోగతి సాధించే అవకాశముంది.