తెలంగాణ

telangana

ETV Bharat / crime

Casino: చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని విచారిస్తున్న ఈడీ.. హవాలా లెక్క తేలేనా? - Chikoti Praveen casino case

క్యాసినో కేసులో ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్‌ బృందం వచ్చింది. ఇప్పటికే ప్రవీణ్‌, మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు జరిపిన అధికారులు... ల్యాప్‌టాప్‌లు, ఇతరదస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశముంది. విదేశాల్లో క్యాసినో క్యాంపులకు వందలమంది పంటర్లను తరలించినట్టు ఆధారాలు సేకరించారు.

ED interrogate the Chikoti Praveen team
నేడు ఈడీ ముందుకు చీకోటి బృందం.. హవాలా లెక్క తేలేనా?

By

Published : Aug 1, 2022, 8:52 AM IST

Updated : Aug 1, 2022, 12:40 PM IST

Casino: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని అధికారులు విచారిస్తున్నారు. ఈ అంశంలో జరిగిన లావాదేవీలపై ప్రవీణ్‌తో పాటు బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి, ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ క్యాసినో దందాలో జరిగిన హవాలా లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు అడిగిన బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను ప్రవీణ్‌ వారికి అందజేసినట్లు సమాచారం.

నేపాల్‌, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్‌ బృందం తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఒక్కో విడత మూడు నాలుగు రోజులపాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు రూ.3-5లక్షల చొప్పున వారికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్‌ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకుని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యాలను ప్రస్తావిస్తూ చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయంలో వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Last Updated : Aug 1, 2022, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details