BANK FRAUDS: బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై పీసీహెచ్ గ్రూప్ సంస్థల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 77 బోగస్ కంపెనీలను స్థాపించి రూ.747 కోట్ల మేర ముంచిన వ్యవహారంలో ఈడీ గురువారం రూ.6.18 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. హైదరాబాద్, బెంగళూరుల్లో సంస్థకు సంబంధించిన 11 ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల నిర్వాహకుడు బల్వీందర్‌సింగ్ పాల్పడిన మోసంపై ఇప్పటికే చెన్నై సీబీఐ ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.
తమ సంస్థల్లో భారీగా టర్నోవర్ ఉందంటూ తప్పుడు డాక్యుమెంట్లతో చెన్నై పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ జార్జ్‌టౌన్ బ్రాంచ్ నుంచి తీసుకున్న రూ.22.15కోట్ల రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించారనేది సీబీఐ అభియోగం. అలాగే సీబీఐ చెన్నై, బెంగళూరుల్లోనూ ఈ సంస్థలపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయడంతో సంస్థ నిర్వాకం బహిర్గతమైంది. పీసీహెచ్ సంస్థ పలు ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లు తేలింది. బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలను హైదరాబాద్, ముంబయిల్లోని సంస్థ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఏల సహకారంతో మళ్లించినట్లు వెల్లడైంది. తిరిగి ఆ డబ్బునే సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడంతో పాటు సంస్థ ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా ఉన్నాయని తప్పుడు రికార్డుల్ని సృష్టించి మళ్లీ బ్యాంకు రుణాల్ని పొందారు.