కరోనా వైరస్ దరి చేరకుండా మాస్కులతోపాటు వినియోగిస్తున్న శానిటైజర్ల మార్కెట్‌పై కొందరు అక్రమార్కులు కన్నేశారు. నకిలీ శానిటైజర్లను వేల లీటర్లలో తయారు చేసి హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. ఇవే బ్రాండెడ్ శానిటైజర్లంటూ విక్రయిస్తున్నారు. రాజధాని కేంద్రంగా కొనసాగుతున్న ఈ నకిలీ దోపిడీ మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోనూ విస్తరిస్తోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని మధుబన్ కాలనీలో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న ఓ ముఠాను శంషాబాద్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరివద్ద నుంచి 1,300 లీటర్ల నకిలీ శానిటైజర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లీటర్ రూ.150 నుంచి రూ.200
నకిలీ శానిటైజర్లను తయారు చేస్తున్న తయారు చేస్తున్నవారు ఇథైల్ ఆల్కహాల్ బదులుగా మిథైల్ ఆల్కహాల్, ఫైపాలాప్స్, రంగునీళ్లు, పరిమళ ద్రవ్యాలు కలుపుతున్నారు. బ్రాండెడ్ శానిటైజర్ లీటర్ ధర హోల్‌సేల్‌లో రూ.500లు ఉండగా, నిందితులు లీటర్ రూ.150ల నుంచి రూ.200లకు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వేగంగా విక్రయాలు జరిగే మార్కెట్లను ఎంచుకుని ఐదు లీటర్ల క్యాన్లలో ఇస్తున్నారు. వాటిపై ముంబయికి చెందిన కంపెనీల బ్రాండ్లను ముద్రిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అమీర్‌పేట, బాలానగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు వెళ్లి క్యాన్లను విక్రయిస్తున్నారు. అటు హోల్‌సేల్ వ్యాపారులు, ఇటు నిందితులు రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. నెలకు రూ.కోట్లలోనే టర్నోవర్ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.