తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drunk and Drive in Morning: ఇకపై పగలు కూడా డ్రంకెన్​డ్రైవ్​ టెస్టులు.. ఈ ప్రాంతాల్లోనే..! - Drunk and Drive cases in hyderabad

Drunk and Drive in Morning: రోడ్డు ప్రమాదాలకు నివారించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇప్పటికే కొరడా ఝులిపిస్తున్న పోలీసులు... ఈ విషయంలో మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రాత్రి వేళల్లోనే చేపట్టే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను పగటిపూట కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

Drunk and Drive tests in hyderabad in the Morning
Drunk and Drive tests in hyderabad in the Morning

By

Published : Jan 9, 2022, 5:28 AM IST

Drunk and Drive in Morning: పీకల్లోతు మద్యం, మెరుపు వేగంతో డ్రైవింగ్, ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం, ఎవరేం చేస్తారులే అన్న లెక్కలేని తనం... వెరసి ఎన్నో జీవితాలను శోకసంద్రంలోకి నెట్టుతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారే కాదు... తమ దారిన తాము వెళ్లే అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో మద్యం సేవించి, వాహనాలు నడిపే వారి విషయంలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా... ఆశించిన మేర ప్రయోజనం మాత్రం చేకూరటంలేదు.

చిత్తుగా తాగేసి దర్జాగా..

మోతాదుకు మించి మద్యం సేవించటమే కాకుండా సొంతంగా బైకులు, కార్లు నడుపుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్పిస్తే... తగ్గటంలేదు. పోలీసులు కేవలం రాత్రి వేళల్లోనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుడటంతో... ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పబ్బులు, బార్లలలో చిత్తుగా తాగేసి... వాహనాలు నడుపుతున్నారు. వీరిలో ఎక్కువగా ఏటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్నారు. ఈ తరహాలోనే ఇటీవల బంజారాహిల్స్‌లో రోహిత్‌గౌడ్, సోమన్‌లు మద్యం మత్తులో కారు నడిపి... ఇద్దరు యువకుల ప్రాణాలు తీశారు. ఈ ఘటన మరువక ముందే గచ్చిబౌలి పరిధిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు దుర్మరణం చెందారు.

ఇకపై పగటిపూట సైతం తనిఖీలు..

ఇలా రాత్రివేళతో పాటు తెల్లవారుజామున, మధ్యాహ్నం సైతం ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు... ఇకపై పగటిపూట సైతం తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్‌, సికింద్రాబాద్‌లోని ప్రాంతాలతో పాటు అబిడ్స్, కోఠీ, అంబర్‌పేట, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, లిబర్టీలో పగటిపూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పోలీసులు... ఒకరోజు బేగంపేట-సికింద్రాబాద్‌ మార్గంలో... మరోరోజు జూబ్లీహిల్స్‌-మాదాపూర్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. ఇంకోరోజు కోఠీ-నాంపల్లి-ఖైరతాబాద్‌ మార్గంలో డ్రైవ్‌ చేపడుతున్నారు.

పాస్​పోర్టు, వీసాలు, ఉద్యోగాలపై ప్రభావం..

చట్టం ప్రకారం మద్యం తాగిన వారి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల అల్కాహాల్‌ వరకే అనుమతి ఉంటుంది. అది దాటితే మద్యంతాగిన వ్యక్తిపై కేసు నమోదు చేయనున్నారు. శ్వాస పరీక్ష నిర్వహించేటప్పుడు మందుబాబులు గొడవకు దిగకుండా ఒకరికి వినియోగించిన బ్రీత్‌ అనలైజర్‌ను మరోసారి ఉపయోగించడం లేదు. రక్తంలో అల్కాహాల్‌ శాతం దాటినట్టు మీటర్‌ చూపించగానే.. కేసులు నమోదు చేయనున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడి జైలుకు వెళ్తే భవిష్యత్తులో వారికి పాస్‌పోర్టు, వీసా, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే సందర్భాల్లో ప్రభావం చూపిస్తాయని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details