తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా వేళ్లూనుకుపోయిన మత్తుదందా(Drug trafficking in telangana) విశ్వరూపం క్రమంగా వెలుగుచూస్తోంది. పోలీస్, ఎక్సైజ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) తదితర దర్యాప్తు సంస్థలు నిఘా విస్తృతం చేయడంతో రోజూ ఏదో ఒకచోట ఈ వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ ఈ దందా సాగలేదా? అంటే కచ్చితంగా సాగింది. కానీ నిఘా లోపంతో బయటపడలేదు. లాక్‌డౌన్‌లో ఈ అక్రమ మత్తు ముఠాలు మరింత వేగంగా విస్తరించాయి. పనుల్లేక ఖాళీగా ఉన్న యువతలో పలువురు మాదకద్రవ్యాలకు దగ్గరయ్యారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన పలువురు ఊళ్లకూ మాదకద్రవ్యాల్ని విస్తరింపజేశారు. అయితే పాత నేరస్థులే ఎక్కువగా చిక్కుతుండటాన్ని బట్టి ఎన్‌డీపీఎస్ చట్టం అంటే మత్తు ముఠాలకు(Drug trafficking in telangana) భయం కలగడంలేదని తెలుస్తోంది.
3-4 ఏళ్ల తర్వాత ట్రయల్స్
ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టయితే బెయిల్ సులభంగా దొరకదు. కనీసం 90 రోజులు.. తీవ్రత అధికంగా ఉంటే 180 రోజులు బయటికి రాలేరు. ఒక వ్యక్తి దగ్గర 1-20 కిలోల్లోపు మాదకద్రవ్యాలు(Drug trafficking in telangana) దొరికి నేరం రుజువైతే 10 ఏళ్లవరకు శిక్షపడుతుంది. 20 కిలోలు దాటితే 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశముంది. అయితే కేసు నమోదైన 3-4 ఏళ్ల తర్వాత కానీ ట్రయల్స్ ఆరంభం కావడం లేదు. ఈలోపు బెయిల్‌పై బయటికి వస్తున్న నేరస్థులు తిరిగి దందా కొనసాగిస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు ఇదే తరహా కేసుల్లో అరెస్టయిన నిందితులతో కలిసి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దర్యాప్తు సంస్థల కళ్లు కప్పడమెలా? దొరకకుండా తప్పించుకోవడం ఎలా? అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో చిక్కిన ‘మెపిడ్రిన్’ కేసు కీలక నిందితుడు హన్మంతరెడ్డి గడిచిన నాలుగేళ్లలో దాదాపు రెండేళ్లు జైలులోనే ఉన్నాడు. గతంలో పటాన్‌చెరులో డీఆర్‌ఐకి, మహబూబ్‌నగర్‌లో పోలీసులకు దొరికాడు.
మద్యంపైనే మమకారం.. తనిఖీలకు దూరం
మాదకద్రవ్యాల నియంత్రణ బాధ్యత ప్రధానంగా ఎక్సైజ్‌శాఖదే. కానీ మద్యం విక్రయాలపైనే ఆశాఖ నిమగ్నమైందనే విమర్శలున్నాయి. మాదకద్రవ్యాల కేసుల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ లేదు. ఈ కేసుల(Drug trafficking in telangana) దర్యాప్తుపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖలో ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటరూ లేరు. ఆబ్కారీ భవన్, ఎక్సైజ్ అకాడమీలో ఉన్న రెండు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. అనుమానితుల దగ్గర దొరికినవి నిషేధిత మాదకద్రవ్యాలే అని నిరూపించేందుకు సంబంధిత కిట్లతో పరీక్షించాల్సి ఉంటుంది. పోలీస్, ఎక్సైజ్ శాఖల వద్ద ఆ కిట్లు లేవు. ఎన్‌సీబీ నుంచి అయిదేళ్ల క్రితం ఎక్సైజ్‌శాఖ అయిదు కిట్లను తెప్పించుకుంది. వాటిల్లో వినియోగించే రసాయనాల పని సామర్థ్యం ఆరు నెలలే కావడంతో మురిగిపోయాయి. కిట్లను సమకూర్చుకోవడం బడ్జెట్‌తో కూడిన వ్యవహారం కావడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు.