తెలంగాణ

telangana

ETV Bharat / crime

గంజాయి మత్తులో యువత భవిత చిత్తు! - యువతపై గంజాయి తీవ్ర ప్రభావం

ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన యువకులు..వ్యసనాలకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కిక్కు కోసం అడ్డదార్లు తొక్కుతూ మత్తులో చిత్తు అవుతున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఎంతటి నేరానికైనా తెగిస్తున్నారు. తాజాగా విజయవాడలో వంద రూపాయల కోసం బ్లేడ్‌బ్యాచ్‌ సృష్టించిన రగడలోనూ మత్తు వ్యవహారం ఉంది. అందుకే పెడదోవపడుతున్న యువతలో మార్పే లక్ష్యంగా.. ఏపీలోని బెజవాడ పోలీసులు యాంటీ డ్రగ్స్‌ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

drugs-effect-on-youth
drugs-effect-on-youth

By

Published : Apr 3, 2021, 10:34 PM IST

మాదక ద్రవ్యాలకు బానిసలైన యువకులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. సమయానికి మత్తు దొరకకపోతే ఉన్మాదుల్లా ప్రవర్తించి దొంగతనాలకు దిగజారుతున్నారు. వీరిలో ఎక్కువుగా చదువుకునే విద్యార్థులే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులే లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా డ్రగ్స్‌ అమ్మేస్తున్నారు. పిల్లల ప్రవర్తనను కన్నవాళ్లు గుర్తించలేకపోవటంతో మరింత పెడదారి పడుతున్నారని నిపుణులు అంటున్నారు.

యువతపై గంజాయి తీవ్ర ప్రభావం

ఇటీవల ఏపీలోని విజయవాడ నగరంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు యువతపై గంజాయి చూపుతున్న ప్రభావానికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. గత నెల 23న గన్నవరం విమానాశ్రయం వద్ద నెంబర్ ప్లేట్ లేని బైక్​పై ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న యువకుడిని పోలీసులు ఆపి, పత్రాలు చూపించాలనేసరికి అక్కడినుంచి పారిపోయాడు. బైక్ మీద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా 6కిలోల గంజాయిని గుర్తించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 6 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేశారు. తాజాగా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ హల్‌చల్‌ చేశారు. మాదకద్రవ్యాల మత్తులో వంద రూపాయల కోసం గొడవపడి ఒకరిని పొట్టన పెట్టుకున్నారు.

పోలీసుల అవగాహన

మత్తుపదార్థాల విక్రయాల కేసులో ఇప్పటివరకు నగరంలో 170 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాకు విజయవాడ రహదారే కీలకంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. అందువల్ల ఎక్కడికక్కడ నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. యువతను మంచి మార్గంలో పెట్టేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. మత్తుకు గురవుతున్న యువతను ప్రారంభ దశలోనే గుర్తించి కట్టడి చేయాల్సి బాధ్యత తల్లిదండ్రులపై ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు. చిన్నతనం నుంచే డ్రగ్స్‌ అనర్థాలపై అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:ఎగ్జిబిషన్​లో మెరిసిన మన్నారా... అదిరేటి డ్రెస్సుల్లో మోడల్స్​

ABOUT THE AUTHOR

...view details