Drugs Supply to America from Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎన్సీబీ(మాదకద్రవ్యాల నియంత్రణ శాఖ) అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు పలు దేశాలకు వారి వినోదం, అవసరాల కోసం ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా హైదరాబాద్ నుంచి ఔషధాల రూపంలో పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు ఆశిష్ జైన్ నుంచి డ్రగ్స్‌తో పాటు రూ. 3.71 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలుదారుల నుంచి ఆశిష్ జైన్ పలు రకాల లావాదేవీలతో పాటు బిట్ కాయిన్లు తీసుకుంటున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు.
విదేశాలకు నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని.. హైదరాబాద్ కేంద్రంగా ఈ గుట్టు సాగుతోందని ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఒక ప్రత్యేక బృందం.. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఆశిష్ ఇంటిపై దాడులు నిర్వహించింది. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఆశిష్ జైన్ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి భారీగా నిషేధిత ఔషధాలతో పాటు వాటి ద్వారా సంపాదించిన రూ. 3.71కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో చరవాణులు, ల్యాప్ టాప్‌లు, ఇతర ఎలక్ట్రానికి ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు.
దోమల్‌గూడలోని ఓ ఇంట్లో ఆశిష్ జైన్ నివాసం ఉంటూ.. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఓ ఇంటర్నెట్ ఫార్మసీని నిర్వహిస్తున్నాడు. అమెరికాతో పాటు, పలు దేశాలకు సైకోట్రోపిక్లో నిషేధిత ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, ఆల్పాజోలాం, డయాజెపమ్, లోరాజెపమ్, క్లోనజెపమ్, జోల్పిడమ్, ట్రమొడాల్ వంటి ఔషధాలను.. ఆర్డర్లపై సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మెయిల్, ఇంటర్నెట్ వాయిస్ కాల్స్‌తో విదేశీయుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఖాతా తెరిచి.. ముందుగా పేమెంట్ చేయించుకున్నాడు. క్రెడిట్ కార్డ్, పేపాల్‌తో పాటు బిట్ కాయిన్లను కూడా అనుమతిస్తున్నాడు. డబ్బులు అందగానే అత్యవసర ఔషధాల పేరుతో నిషేధిత డ్రగ్స్‌ను.. ఎయిర్ కార్గో, షిప్మెంట్ల ద్వారా సంబంధిత చిరునామాకు కొరియర్ చేస్తున్నాడు.
గత రెండేళ్లలో ఆశిష్ జైన్ వెయ్యికి పైగా కొరియర్లను భారత్ నుంచి అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్‌ను పంపించినట్లు ఎన్సీబీ విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. విచారణలో మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇవీ చదవండి:ATTACK ON LADIES: గంజాయి మత్తులో మహిళలపై దాడి.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
పోలీసులపై మూకదాడి.. 19మందికి గాయాలు.. 12 వాహనాలు ధ్వంసం