Drug mafia in Hyderabad: మత్తుమాఫియా, హవాలా తరలింపు ముఠాలు దిశ మార్చుకున్నాయి. కొద్దికాలం క్రితం వరకు దక్షిణ మండలంలో పాగా వేసిన నేరస్థులు ఉత్తరంవైపు చేరుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్ ద్వారా రాకపోకలకు అనువుగా ఉండటంతో అడ్డాగా మలచుకుంటున్నారు. అధికశాతం నిందితులు ఇక్కడే చిక్కడం అందుకు నిదర్శనం.
బేగంపేట విమానాశ్రయంలోని కొరియర్ సంస్థలు కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్ ముఠా దందా చేసింది. డిసెంబరులో రూ.3.1కోట్ల విలువైన సూడోఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లలో ఈ ముఠా ఇక్కడి నుంచే 100 కిలోల మత్తుపదార్థాలు విదేశాలకు చేరవేసినట్టు గుర్తించారు. ఇటీవల పాతబస్తీకి చెందిన చైన్‌స్నాచర్లు లంబా, జబా అనే పాత నేరస్థులతో కలిసి సికింద్రాబాద్ పాట్‌మార్కెట్ నుంచి బంగారు దుకాణాలకు పంపే వజ్రాలు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకొని బీభత్సం సృష్టించారు. తాజాగా అదేచోట ఒక భవనంలో అగ్నిప్రమాదంలో రూ.5కోట్ల హవాలా సొమ్ము బూడిదైనట్టు సమాచారం.
నిఘా, తనిఖీలతో మారిన రూట్:రెండేళ్ల క్రితం వరకు బేగంబజార్, ఘాన్సీబజార్, గోషామహల్, బహదూర్‌పుర, చార్మినార్, మదీనా హవాలా, అక్రమ బంగారం తరలింపు కేంద్రాలుగా ఉండేవి. ఆధిపత్య పోరులో ముఠాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల నిఘా, తనిఖీలు పెరగటంతో ముఠాలు రాణిగంజ్, జనరల్‌బజార్, పాట్‌మార్కెట్, తిరుమలగిరి, బేగంపేటవైపు మళ్లాయి.