తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూటుమార్చిన డ్రగ్​ డీలర్స్.. సోషల్​మీడియా, డార్క్​నెట్​ నుంచే డీలింగ్​ - Drugs imports in Hyderabad

Drugs imports to Hyderabad: ఏవోబి నుంచి గంజాయి, రాజస్థాన్‌ నుంచి నల్లమందు, గోవా నుంచి ఎల్​ఎస్​డీ బోల్ట్స్, ఎండీఎంఏ, బంగాల్‌ నుంచి హెరాయిన్‌. తాజాగా పంజాబ్‌ నుంచి గసగసాల గడ్డి. ఇదీ.. దేశం నలువైపుల నుంచి హైదరాబాద్‌కు చేరుతున్న మాదకద్రవ్యాల జాబితా. నగరంతో దేశ, విదేశాలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటం, రాకపోకలు సాగించేందుకు అనుకూల వాతావరణం మత్తు మందుల రవాణాకు కలిసివస్తున్నాయి.

drugs
drugs

By

Published : Apr 2, 2022, 7:27 AM IST

రూటుమార్చిన డ్రగ్​ స్మగ్లర్లు.. సోషల్​మీడియా, డార్క్​నెట్​ నుంచే డీలింగ్​

Drugs imports to Hyderabad: మాదక ద్రవ్యాల రవాణాపై గతేడాది ప్రభుత్వం పోలీసు, ఆబ్కారీ శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చేంత వరకూ స్మగ్లర్లు యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అన్ని మార్గాలను వాడుకొని సరకును చేరవేస్తూ వచ్చారు. అనంతరం పోలీసుల ముమ్మర తనిఖీలతో సామాజిక మాధ్యమాలు, డార్క్‌నెట్‌ వంటి వాటిని లావాదేవీలకు అనువుగా మలచుకున్నారు. 10-15 ఏళ్ల క్రితం పబ్‌ల్లో మద్యం మత్తు చాలక నైజీరియన్ల ద్వారా నల్లమందు వాడేవారు. అలా క్రమంగా క్షణాల్లో కిక్కెంచే హెరాయిన్, ఎల్​ఎస్​డీ, ఎంజీఎంఏ వరకు చేరారు. కార్పొరేట్‌ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, సినీ, రాజకీయ పెద్దల వారాంతపు పార్టీలకు రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లు వేదికలయ్యాయి. అక్కడ రేవ్, ముజరా పార్టీల్లో కొత్త ఆనందాలను పంచేందుకు నిర్వాహకులు కాల్‌గాల్స్, డ్రగ్స్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం పార్టీ అంటే.. అందమైన అమ్మాయిలు.. ఆకాశంలో తేలుతున్న అనుభూతిని పంచే మత్తుపదార్థాలు తప్పనిసరిగా మారిపోయాయి.

నైజీరియన్లే అసలు సూత్రదారులు..:ప్రధానంగా చదువు, వ్యాపారం, పర్యాటక వీసాలపై భారత్​కు వచ్చిన నైజీరియన్లు అసలు సూత్రదారులు. పబ్‌ల్లో ఏర్పడిన పరిచయాలతో విక్రయాలు జరుపుతూ... కొందరు పబ్‌ల నిర్వాహకులు కమీషన్‌ కోసం ప్రధాన ఏజెంట్లుగా పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బేగంపేట్‌, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని మూడు పబ్‌లు యువతను ఆకర్షించేందుకు పార్టీల్లో ఎల్​ఎస్​డీ ఉచితంగా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. పబ్‌లు, బార్లు, దాబాలు, జిమ్‌లు, మ్యూజిక్‌ లేదా థీమ్‌ పార్టీల వేదికలు మత్తుపదార్థాలు విక్రయించే ఏజెంట్లకు అనుకూల ప్రాంతాలుగా మారాయి. ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగులు, విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు తీసుకుంటూ క్రమంగా బానిసలవుతున్నారు. కొందరు సరకు కొనేందుకు సొమ్ముల్లేక మత్తుపదార్థాలు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఏజెంట్ల వద్ద సబ్‌ ఏజెంట్లుగా పనిచేస్తూ మాదకద్రవ్యాలను పెడ్లర్స్‌కు అందజేసి కమీషన్‌ తీసుకుంటున్నారు. ఇటీవల పోలీసు, అబ్కారీ అధికారులు అరెస్ట్‌ చేస్తున్న వారిలో అధిక శాతం ఈ జాబితాలోని వారే ఉంటున్నారు. కళాశాల వయసు నుంచే చెడు స్నేహాలకు అలవాటు పడటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, పరీక్షల్లో తప్పటం, కుటుంబ కలహాల వంటి కారణాలతోనే ఎక్కువ మంది యువకులు మత్తుకు బానిసలవుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

వాట్సప్‌, ఇన్‌స్టా గ్రూపుల ద్వారానే.. :గోవా, ముంబయి, బెంగళూరు తదితర నగరాల నుంచి హెరాయిన్, కొకైన్, ఎండీఎంఏ కొనుగోలు చేసిన దళారులు.. ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్లు, కొరియర్‌, డెలివరీ బాయ్స్‌ ద్వారానే మత్తు పదార్థాలను చేరవేస్తుంటారు. మత్తుకు అలవాటుపడిన వారినే సబ్‌ ఏజెంట్లుగా నియమించుకుంటారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా ఉండేదుకు ఫోన్లకు బదులుగా.. వాట్సప్‌, ఇన్‌స్టా గ్రూపుల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చీకటి ప్రదేశాల్లోనే సరకును అందజేసేందుకు ప్రాధాన్యతనిస్తుంటారు. ఇదే వృత్తిగా కొనసాగించే ఒక్కో ఏజెంట్‌ నెలకు 60 నుంచి 70 వేల రూపాయలు, సబ్‌ ఏజెంట్లు 25 వేల వరకు సంపాదిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కేపీహెచ్​బీ, టోలిచౌకి వద్ద మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న మూడు కార్లను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మత్తుపదార్థాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముతోనే కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

ప్రధాన ఏజెంట్లతో ఉన్న లింకులను, సబ్ ఏజెంట్లను కట్ చేసి... దేశం, రాష్ట్రంలోకి డ్రగ్స్ రానివ్వకుండా చేయాలని.. ముఖ్యంగా మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీచూడండి:డ్రగ్స్​​ మోతాదు ఎక్కువై ఇంజినీరింగ్​ విద్యార్థి మృతి.. రాష్ట్రంలోనే ఫస్ట్​ టైం..!

ABOUT THE AUTHOR

...view details