Mohit take a custody in drug case: మాదక ద్రవ్యాల కేసులో నిందితుడు మోహిత్‌ను హైదరాబాద్ రాంగోపాల్‌పేట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ఇటీవల పోలీసులకు చిక్కిన మోహిత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. నిందితుడు ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడ జైళ్లో ఉండగా.. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే మోహిత్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
పోలీసుల వినతిని విచారించిన న్యాయస్థానం ఒక రోజు కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు మాదకద్రవ్యాల విక్రయానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మోహిత్‌ను చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. జైలు నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు డ్రగ్స్ దందాపై విచారిస్తున్నారు. మోహిత్ వద్ద స్వాధీనం చేసుకున్న చరవాణిలోని వివరాలు రాబట్టనున్నారు. విచారణలో భాగంగా ఎడ్విన్‌తో సంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. రేపు ఉదయం 10 గంటల వరకూ మోహిత్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు.
అసలు మోహిత్ ఎలా దొరికాడు: రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలో నవంబర్ 11 నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గర్వ్ హరీశ్ బెలనీ అనే వ్యక్తి 4.5 గ్రాముల ఎండీఎంఏతో దొరికాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించిగా గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్ న్యూన్స్, బాల మురుగన్ పేర్లు బయటకు వచ్చాయి. పక్కా ప్రణాళికతో వీరిని గోవాలో నార్కోటిక్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేసి.. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో నిందితుడు మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్‌పై నిఘా పెట్టి.. అరెస్టు చేశారు.