తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనూష మృతిపై వీడని అనుమానాలు.. ఆరోజు కోటలో ఏం జరిగింది..? - అనుష మృతి కేసులో అనుమానాలు

Anusha death case: ఆంధ్రప్రదేశ్​లో సంచలనం సృష్టించిన వైఎస్సార్ జిల్లా బద్వేలులో డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై అనుమానాలు వీడటం లేదు. ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పకుండా ఫోరెన్సిక్‌ నివేదికపై నెపం నెట్టేస్తున్నారు. ఊపిరితిత్తులు, కాలేయంలోకి భారీగా నీరు చేరడంతో విద్యార్థిని చనిపోయిందంటున్న పోలీసులు.. ఆమె నదిలో దూకిందా లేక తోశారా అనే విషయాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ప్రేమ పేరుతో వేధించిన గురుమహేశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతడు ఈ నెల 20న సిద్ధవటం కోటకు వెళ్లలేదని తేల్చి చెబుతున్నారు. ఆ రోజు కోటలో ఏం జరిగిందో చిక్కుముడి వీడటం లేదు.

Anusha death case
Anusha death case

By

Published : Oct 26, 2022, 10:02 AM IST

అనూష మృతిపై వీడని అనుమానాలు

Anusha death case: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష అనుమానాస్పదన మృతి కేసు ఎటూ తేలడం లేదు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించిన గురుమహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసినా.. అతడి పాత్రపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 23న సిద్ధవటం మండలం జంగాలపల్లె ఇసుక క్వారీ వద్ద పెన్నా నదిలో అనూష మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదే రోజున ఆమెది ఆత్మహత్యేనని.. మైదుకూరు డీఎస్పీ ప్రకటన విడుదల చేయడం.. మంగళవారం నాటి మీడియా సమావేశంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. ఎస్పీ అన్బురాజన్‌ ప్రకటించడం.. అనుమానాలకు తావిస్తోంది.

వైఎస్సార్‌ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లెకు చెందిన అనూష.. బద్వేలులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండో సంవత్సవం చదువుతోంది. అదే కళాశాలలో చదివే బద్వేలు మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన గురుమహేశ్వర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఈ నెల 19న బైక్‌పై బద్వేలు నుంచి సిద్ధవటం కోటకు వెళ్లి.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగివచ్చారని ఎస్పీ తెలిపారు. అదే రోజున వారు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసుకుంటుండగా అనూష సోదరి గురుమహేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేసి మందలించిందని విచారణలో తెలిసినట్లు వెల్లడించారు. 20వ తేదీ తన పుట్టినరోజు కావడంతో అనూషను కళాశాలకు పంపాలని ఆమె సోదరిని మహేశ్వర్‌రెడ్డి కోరాడని తెలిపారు. ఈ విషయంలో అనూష సోదరి, గురుమహేశ్వర్‌రెడ్డికి మధ్య.. ఇన్‌స్టాగ్రామ్‌లో వాదనలు జరిగినట్లు వెల్లడించారు.

20వ తేదీ ఉదయం స్వగ్రామం నుంచి ఆటోలో బద్వేలు వెళ్లిన అనూష.. అక్కడి నుంచి సిద్ధవటం కోటకు బస్సులో వెళ్లిందని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో గురుమహేశ్వర్‌రెడ్డి, అతడి స్నేహితులు లేరనడానికి తగిన ఆధారాలున్నాయని వివరించారు. అనూష ఒంటరిగా సిద్ధవటం కోటకు ఎందుకు వెళ్లి ఉంటుందనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. కోటలోని సీసీటీవీ దృశ్యాలను ఇంకా పరిశీలించలేదన్న ఎస్పీ అన్బురాజన్‌.. వాటి కోసం పురావస్తు అధికారులకు లేఖ రాశామని చెప్పారు.

సిద్ధవటం కోట వెనుకవైపే పెన్నా నది ఉంది. కోటపై నుంచి అనూష నదిలోకి దూకిందా లేక ఎవరైనా తోసేశారా అన్నది తేలాల్సి ఉంది. శవపరీక్ష నివేదిక ప్రకారం.. ఊపిరితిత్తులు, కాలేయంలోకి ఎక్కువగా నీరు చేరి అనూష చనిపోయినట్లు.. ఎస్పీ తెలిపారు. మృతదేహాంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. ఈ అంశాలను నిర్ధరణ చేయడానికి.. మరోసారి శరీర భాగాలను ఆర్​ఎఫ్​ఎస్​ఎల్​కు పంపామని వెల్లడించారు. కాల్‌ డేటా సమాచారం, సాంకేతికపరమైన అంశాల ఆధారంగా.. అనూష మృతి కేసుపై.. ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చాక.. మరణంపై అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details