ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకి జిల్లాలో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 18 మంది మరణించారు. 15 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
రామ్ సనేహి ఘాట్ ప్రాంతంలోని లఖ్‌నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు లఖ్‌నవూ జోన్ ఏడీజీ సత్యనారాయణ్ సాబత్ తెలిపారు. బస్సు హరియాణా నుంచి బిహార్‌కు వెళ్తోందని చెప్పారు.
మరమ్మత్తుల కోసమని ఆగి...
పోలీసుల కథనం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మరమ్మతుల కోసం బస్సు కల్యాణి నది వంతెన వద్ద ఆగింది. వర్షం భారీగా కురుస్తున్న కారణంగా బస్సును రోడ్డు పక్కనే నిలిపి ఉంచి డ్రైవర్, ఆపరేటర్.. మరమ్మత్తులు చేశారు. ఈ సమయంలో కొందరు ప్రయాణికులు కిందకు దిగి బస్సు చుట్టుపక్కల నిల్చున్నారు. అదేసమయంలో నియంత్రణ కోల్పోయిన ట్రక్కు లఖ్‌నవూ వైపు నుంచి వేగంగా దూసుకొచ్చింది. ఒక్కసారిగా బస్సును ఢీకొట్టింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మోదీ సంతాపం
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి వీటిని విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది.
ఇదీ చూడండి:KIDNAP: నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం.. సినీఫక్కీలో దుండగులను పట్టుకున్న పోలీసులు