కుక్కలు విశ్వానికి మారుపేరు. కానీ ఈ శునకాలంటేనే సిరిసిల్ల వాసులు భయపడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కరుస్తూ గాయపరుస్తున్నాయి. కుక్కల సంఖ్య పెరగడంతో ఏ వీధిలో చూసినా గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండటం వల్ల వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనితో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కుక్కల దాడిలో(Dog Bite humans) 17 మందికి తీవ్రగాయాలయ్యాయి.
పట్టణంలోని సిద్ధార్థ నగర్, మెహర్ నగర్ ప్రాంతాల్లో కుక్కలు రాత్రివేళ తిరుగుతూ అడ్డొచ్చిన వారిని 17 మందిని కరిచాయి. ఓ చిన్నారిపై దాడి చేస్తుండగా.. తల్లిదండ్రులు అడ్డుకునే ప్రయత్నం చేసినా... వదిలిపెట్టలేదు. చిన్నారితో సహా మరో 16 మందిపై కుక్కలు దాడి (Dog Bite humans) చేశాయి. కాళ్లు, చేతులపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడుల్లో తీవ్రగాయాలపాలైన బాధితులు.. సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.