గుండెపోటుతో ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. వైద్యుడు గుండెపోటు వచ్చిన వ్యక్తిని పరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో వైద్యుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. రోగిని పరీక్షిస్తూనే కింద పడిపోయాడు. అక్కడున్న వారూ, సిబ్బంది కంగారు పడ్డారు. సిబ్బంది వైద్యుడిని పరిశీలించగా ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. రోగిని కాపాడే క్రమంలో వైద్యుడు ప్రాణాలు వదిలారు. వెంటనే గుండెపోటు వచ్చిన రోగిని మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలో అతని ఊపిరి ఆగిపోయింది. ప్రాణాల కోసం ఆస్పత్రికి వచ్చిన రోగితోపాటు వైద్యుడూ ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
పేషెంట్‌ను చూస్తూనే కుప్పకూలిన వైద్యుడు
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోత్ జగ్యానాయక్(48) గొల్లాడితండాలోని బంధువుల ఇంటికి నిన్న దినకర్మకు వెళ్లారు. రాత్రి అక్కడే నిద్రించారు. తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు హుటాహుటిన అతన్ని గాంధారి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయ్యప్ప మాల ధరించిన వైద్యుడు డా.ధరంసోత్ లక్ష్మణ్ అప్పుడే పూజ ముగించుకుని ఆస్పత్రికి వచ్చి గుండెపోటు వచ్చిన రోగిని పరీక్షిస్తున్నాడు. ఇంతలోనే వైద్యుడు లక్ష్మణ్ సైతం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పేషెంట్‌ను చూస్తూనే హఠాత్తుగా కింద పడిపోయాడు. అక్కడి సిబ్బంది, ఇతర ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తుండగానే కన్నుమూశారు. పేషెంట్‌కు వైద్యం అందిస్తూనే ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యుడు గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. వైద్యుడు మరణించిన విషాద సమయంలోనే రోగిని బతికించుకునేందుకు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రోగి మరణించాడు.