దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో(Disha case news) మంగళవారం నుంచి వాదనలు మొదలయ్యాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన జొల్లు శివ, నవీన్, జొల్లు నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్‌లు చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్‌కు మృతుల కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాది కేవీ కృష్ణమాచారి, సామాజిక కార్యకర్త సజయ తదితరులు ఫిర్యాదుచేశారు. కమిషన్ ఇప్పటివరకు సంఘటనలో పాల్గొన్న పోలీసులను విచారించి వారి వాంగ్మూలం(hyderabad encounter case details) నమోదు చేసింది.
వాదనలు మొదలు
మంగళవారం వాదనలు మొదలుకాగా తొలుత కృష్ణమాచారి తన వాదనలు వినిపించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటరని(hyderabad encounter case details), నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని కాల్చి చంపి కట్టుకథలు చెబుతున్నారన్నారు. నిందితుల్లో ముగ్గురు బాలలున్నారని, వారిని జువైనల్ కోర్డుకు పంపకుండా, వయసు దాచిపెట్టి మరీ మామూలు జైలుకు పంపారన్నారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు కూడా తప్పుడు రికార్డులు సమర్పించారన్నారు. మరో న్యాయవాది వసుధా నాగరాజు తన వాదనలు వినిపిస్తూ నిందితులను జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాల్సి ఉండగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారన్నారు. అక్కడ 15 రోజులు రిమాండ్ విధించడం కూడా నిబంధనలకు విరుద్ధమన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకే పోలీసులు ఇలా చేశారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.