Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ 2017లో తెలుగు సినీ ప్రముఖుల పాత్రపై ఏమీ తేల్చలేకపోయినా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పటి దర్యాప్తు సమగ్ర వివరాలను తమకు ఇవ్వాలన్న న్యాయస్థానం ఆదేశాలనూ ఎక్సైజ్‌శాఖ పాటించలేదంటూ ఈడీ మూడురోజుల క్రితం హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. దర్యాప్తు వివరాలతోపాటు తాము సేకరించిన ఆధారాలను ట్రయల్ కోర్టుకు అప్పగించామని ఎక్సైజ్‌శాఖ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. ఈడీ అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం వెనక ఎక్సైజ్‌శాఖ ఉద్దేశమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎవరినైనా కాపాడేందుకు యత్నిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్సైజ్‌శాఖ ఏమిచ్చింది..? ఏం దాస్తోంది..?:2017లో ఎక్సైజ్‌శాఖ దర్యాప్తు చేసినప్పుడు కెల్విన్ నుంచి కీలకమైన డిజిటల్ రికార్డుల్ని స్వాధీనం చేసుకుంది. సినీతారల వాంగ్మూలాలతోపాటు కాల్‌రికార్డులు సేకరించింది. ఈ వివరాల కోసం ఈడీ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.12 కేసుల్లో 23 మంది నిందితులున్నా కెల్విన్, నిఖిల్‌శెట్టి, రవికిరణ్, జిషాన్‌అలీఖాన్, బెనార్డ్ విల్సన్ వాంగ్మూలాలు మాత్రమే ట్రయల్‌కోర్టులో లభ్యమయ్యాయి. ఎలాంటి డిజిటల్ రికార్డులు లభించలేదు.
*ఎక్సైజ్‌శాఖ విచారించిన సినీతారల వాంగ్మూలాలు మాత్రమే ట్రయల్‌కోర్టులో ఉన్నాయి. కానీ వారి కాల్‌రికార్డుల్ని కోర్టుకు సమర్పించలేదు. రహస్యంగా ఉంచిన వాటిని తమకు అప్పగించాలని ఈడీ అడుగుతోంది. కెల్విన్ తదితరులతో సినీతారల సంబంధాల్ని నిగ్గు తేల్చేందుకు ఈ కాల్‌రికార్డులే కీలకమని చెబుతోంది. వారి వాంగ్మూలాల్ని ఎక్సైజ్‌శాఖ ఆడియో, వీడియో రికార్డింగ్ చేసింది. కానీ అవి ఇప్పటికీ ఈడీ వద్దకు చేరలేదు.
*జియో సిమ్‌తో కూడిన కెల్విన్ కూల్‌ప్యాడ్‌ను ఎక్సైజ్‌శాఖ జప్తు చేసింది. అలాగే అతడితోపాటు మరో ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి సీపీయూ, సీడీడ్రైవ్, డెస్క్‌టాప్, 8 సెల్‌ఫోన్లు, 2 సిమ్‌కార్డులు, 2 పెన్‌డ్రైవ్‌లు, ఫోన్‌నంబర్లతో కూడిన పేపర్లను స్వాధీనం చేసుకుంది. కెల్విన్ కూల్‌ప్యాడ్‌లోనే సినీప్రముఖుల చిట్టా ఉందనే అనుమానాల నేపథ్యంలో ఈడీ దర్యాప్తులో అది కీలకం కానుంది.
ఆరు లేఖలు రాసినా ఎక్సైజ్ ససేమిరా:టాలీవుడ్‌డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖ డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి 12 ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసింది. ఆయనతో సంబంధాలున్నాయనే అనుమానంతో పూరి జగన్నాథ్, ఛార్మి, ముమైత్‌ఖాన్, రవితేజ.. తదితర సినీ ప్రముఖులు సహా 41 మందిని విచారించింది. కానీ వారి పాత్రను తేల్చలేకపోయింది. దర్యాప్తు వివరాల కోసం 2020 నవంబరు నుంచి ఎక్సైజ్‌శాఖకు లేఖలు రాసింది. హైకోర్టు ఉత్తర్వులతో కూడిన లేఖతో ఫిబ్రవరి 8న మరో లేఖ రాసింది. కానీ ఎక్సైజ్‌శాఖ ఎఫ్‌ఐఆర్లు, అభియోగపత్రాలు మాత్రమే అందించింది. ఈడీ అడిగిన డిజిటల్ రికార్డులను అందించలేకపోయింది. అవి ట్రయల్ కోర్టులో ఉన్నాయని సమాధానమిచ్చింది. కానీ ట్రయల్ కోర్టులోనూ ఆ ఆధారాల్లేవని తాజాగా ఈడీ స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది.