తెలంగాణ

telangana

ETV Bharat / crime

మనీ ట్రాన్స్​ఫర్​ చేసి.. క్యాష్​ తీసుకున్నారా..? అయితే ఇది మీకూ జరిగుంటుంది..!

మీరు డిజిటల్​ పేమెంట్స్​ చేస్తున్నారా..? లేదా.. మీకు ఎవరైన డిజిటల్​గా పేమెంట్స్​ చేస్తున్నారా..? మొదటిదేమో కానీ.. రెండో సందర్భంలో మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలండోయ్​..! మనీ ట్రాన్స్​ఫర్​ యాప్​ల ద్వారా డబ్బులు పంపించి.. మీ నుంచి క్యాష్ తీసుకోవటం లాంటి లావాదేవీలు చేస్తున్నారా..? అయితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనండోయ్​..! ఎందుకంటారా..? ఈ స్టోరీ చదివితే.. మీకే పూర్తిగా అర్థమైపోతుంది..​

మనీ ట్రాన్స్​ఫర్​ చేసి.. క్యాష్​ తీసుకున్నారా..? అయితే ఇది మీకూ జరిగుంటుంది..!
మనీ ట్రాన్స్​ఫర్​ చేసి.. క్యాష్​ తీసుకున్నారా..? అయితే ఇది మీకూ జరిగుంటుంది..!

By

Published : Apr 20, 2022, 9:59 PM IST

Updated : Apr 21, 2022, 4:23 PM IST

మనీ ట్రాన్స్​ఫర్​ చేసి.. క్యాష్​ తీసుకున్నారా..? అయితే ఇది మీకూ జరిగుంటుంది..!

"నాకు కొంచెం క్యాష్​ అవసరముంది. అయితే అకౌంట్​లో బ్యాలెన్స్​ ఉంది కానీ.. చేతిలో నగదు లేదు. యాప్​​(మనీ ట్రాన్స్​ఫర్​ యాప్స్​) ద్వారా మీ అంకౌంట్​కు మనీ ట్రాన్స్​ఫర్​ చేస్తా.. చేతికి డబ్బు ఇస్తారా.. ప్లీజ్​ ?"

"ఓ.. దాందేముంది.. పంపించండి. ఇస్తా..!"

"ఇప్పుడే పంపిస్తున్నా..!! ఇదిగో పంపించాను. చూడండి(మనీ సెండ్/కట్​​ అయినట్టుగా వచ్చిన సందేశం చూపిస్తూ..). ఒకసారి చెక్​ చేసుకోండి.. మీకు వచ్చాయా..?"

"మీకు వెళ్లినట్టు వచ్చింది కదా.. ఇంకేంటి..! ఎక్కడికిపోతాయి.. అవే వస్తాయి లెండి.. ఓ నిమిషం అటు ఇటూ..!!"

ఇలాంటి సంభాషణ మనం దుకాణాల దగ్గరో.. స్నేహితుల మధ్యో.. తరచూ వింటుంటాం. అకస్మాత్తుగా ఏదో అవసరం వచ్చి పడుతుంది. అది తీర్చుకోవాలంటే డబ్బు కావాలి. కానీ.. జేబులో సరిపడ పైసలుండవు. అకౌంట్​లో ఉన్నా.. దగ్గర్లో ఏటీఎంలుండవు. అలాంటి సమయంలోనే ఇలాంటి సన్నివేశం చోటుచేసుకుంటుంది. మన మీద నమ్మకంతోనో.. లేదా డబ్బులు పంపించినట్టు మొబైల్​లో చూపించిన సందేశంతోనో.. వాళ్లకు డబ్బు వచ్చినట్టు నిర్ధరించుకో ముందే నగదు చేతికిచ్చేయటమో.. దుకాణాల్లో వస్తువులు ఇచ్చేయటమో.. చేస్తుంటారు. అయితే.. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఇలాంటి నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు.. ఫేక్​ యాప్స్​ ద్వారా డబ్బులు పంపించినట్టు నకిలీ సందేశాలు చూపించి మోసాలకు తెరతీస్తున్నారు. హైదరాబాద్​లోని వనస్థలిపురం పరిధిలో జరిగిన ఘటనతో ఈ మోసం బయటపడింది.

వనస్థలిపురం పోలీస్​స్టేషన్​ పరిధిలోని సుష్మ సమీపంలో ఉన్న ఓ మనీట్రాన్స్​ఫర్​ దుకాణానికి ఈనెల 9న ఓ యువకుడు వచ్చాడు. తనకు అర్జెంటుగా 30 వేల నగదు కావాలని.. యాప్​ ద్వారా మీకు మనీ ట్రాన్స్​ఫర్​ చేస్తానని చెప్పాడు. సరేనన్న షాప్​ యజమాని.. యాప్​ క్యూఆర్​ కోడ్​ చూపించాడు. వెంటనే దాన్ని స్కాన్​ చేసి 30 వేలు పంపించినట్టు సందేశాన్ని చూపించి.. డబ్బు ఇమ్మని కోరాడు. షాప్​ యజమాని మాత్రం తనకు డబ్బు వచ్చినట్టు మెస్సేజ్​ రాలేదని.. కాసేపు వేచి ఉండమని సూచించాడు. కానీ.. ఆ యువకుడు.. తను వేరే వాళ్లకు అత్యవసరంగా డబ్బు ఇవ్వాల్సి ఉందని.. తొందరగా ఇవ్వాలని.. కాస్త హడావుడి చేశాడు.

అయినా.. ఆ దుకాణదారుడు ఇవ్వలేదు. కనీసం 15 వేలు అయినా ఇవ్వాలని.. తొందరపెట్టాడు. సదరు వ్యక్తి ఎంత హడావుడి చేసినా.. షాప్​ యజమాని మాత్రం.. ఒక్క రూపాయి ఇచ్చేది లేదని.. డబ్బు క్రెడిట్​ అయినట్టు సందేశం వచ్చాకే ఇస్తానని తెగేసి చెప్పాడు. దీంతో.. ఆ యువకుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అప్పుడు ఆ షాప్​ యజమానికి అనుమానం వచ్చింది. డబ్బులు పంపించి తన అకౌంట్​ నుంచి కట్​ అయ్యాక కూడా.. ఇవ్వకముందే వెళ్లిపోయాడంటే ఇందులో ఏదో మతలబుందని గ్రహించాడు. ఏదో నకిలీ యాప్​ ద్వారా పంపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడని నిర్ధరించుకున్నాడు.

అయితే.. ఆ యువకుడు మాత్రం ఐదు నిమిషాల వ్యవధిలోనే.. ఎన్జీవోస్ కాలనీలోని మరో మనీ ట్రాన్స్​ఫర్​ దుకాణానికి వెళ్లాడు. అచ్చంగా.. ముందు దుకాణంలో చేసిన హడావుడే ఇక్కడా చేశాడు. ఆ దుకాణంలో ఉన్న వ్యక్తి.. యువకుడికి నిజంగానే అత్యవసరముందేమోనని నమ్మి క్రెడిట్​ సందేశం రాకముందే.. 30 వేలు ఇచ్చేశాడు. వెంటనే డబ్బు తీసుకుని సదరు యువకుడు అక్కడి నుంచి క్షణాల్లోనే మాయమైపోయాడు. కానీ.. ఆ దుకాణంలో ఉన్న వ్యక్తి మాత్రం గంటల తరబడి చూసినా.. అమౌంట్​ క్రెడిట్​ కాలేదు. చివరికి.. ఓ ఫేక్​ యాప్​ ద్వారా తనను మోసం చేశాడని గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇలాంటి గుర్తుతెలియని వ్యక్తులు వనస్థలిపురం పరిధిలోనే గత నెల రోజులలో పలు మనీ ట్రాన్స్​ఫర్​ దుకాణాలకు వెళ్లినట్లు పోలీసుల పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు పంపించినట్టు, తమ అకౌంట్ నుంచి కట్​ అయినట్టు సందేశాలు చూపించినంత మాత్రాన నమ్మవద్దని.. డబ్బు క్రెడిట్​ అయినట్టు నిర్ధరించుకున్న తర్వాతే నగదు ఇవ్వాలని.. అప్రమత్తంగా ఉన్న దుకాణయజమాని, మోసపోయిన బాధితులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 21, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details