drug gang in Rachakonda: అక్రమార్కుల ఆట కట్టించేందుకు పోలీసులు ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా.. అడ్డదారులకు అలవాటు పడిన కేటుగాళ్లు మాత్రం అంతకుమించిన దొంగతెలివి ప్రదర్శిస్తున్నారు. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పటిష్ఠచర్యలు చేపడుతున్నా.. తమదైన తెలివితేటలతో సరకు రవాణా చేస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ డ్రగ్స్ ముఠా ఎత్తులను రాచకొండ పోలీసులు చిత్తుచేశారు.
చెన్నెకు చెందిన మహమ్మద్ ఖాసీం, రసూలుద్దీన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి.. మాదకద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో మధురై, చెన్నై ప్రాంతాలను డ్రగ్స్‌ను తరలించిన ఈ ముఠా.. చెన్నైలో డీఆర్ఐ అధికారుల పటిష్ఠ చర్యలతో కొత్తమార్గాలను ఎంచుకున్నారు. హైదరాబాద్, పుణెకు బస్సుల్లో వెళ్లి.. అక్కడి నుంచి విమానాశ్రయాలకు తరలించి.. అక్కడి నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు ఎగుమతి చేస్తున్నారు.
విమానాశ్రయాల్లో తనిఖీ కేంద్రం వద్ద పొడి పదార్థాలు గుర్తించే అవకాశం లేకపోవటంతో.. దీనిని ఆసరాగా చేసుకుని, రామ్‌రాజ్ వస్త్రాల పెట్టెల్లో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే ఖాసీం, రసూలుద్దీన్ చెన్నె నుంచి బస్సులో వచ్చి హైదరాబాద్ నాచారంలో ఉన్నట్లు వచ్చిన సమాచారంతో పట్టుకున్నట్లు చెప్పారు.