Dental Student Murder in Guntur District: ఎన్నిచట్టాలు తెచ్చినా ఆడబిడ్డలపై దాష్టీకాలు ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగిన డెంటల్ విద్యార్థిని తపస్వి అమానుష హత్య.. అందరినీ తీవ్రంగా కలచివేసింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన పిన్నమనేని తపస్వి.. విజయవాడ సిద్దార్థ దంత వైద్యకళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకునేది.
మూడ్రోజుల కిందట తక్కెళ్లపాడులోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు జ్ఞానేశ్వర్.. సోమవారం అక్కడికి వచ్చి తపస్విని దారుణంగా హత్య చేశాడు. ఆపరేషన్లకు వినియోగించే సర్జికల్ బ్లేడుతో గొంతు కోశాడు. ఆ తరువాత కూడా ఇంట్లో అటు, ఇటు ఈడ్చుకెళ్లి పైశాచికంగా వ్యవహరించాడు. తపస్వి స్నేహితురాలి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికే ఘోరం జరిగిపోయింది.