Delivery Boy jumps off a Building in Hyderabad : ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఉన్న కుక్కకు భయపడి పరుగు తీసి భవనం మీది నుంచి దూకి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వైద్యులు చెప్పినట్లు అతడి సోదరుడు తెలిపారు.
కుక్కకు భయపడి భవనంపై నుంచి దూకిన డెలివరీ బాయ్ - కుక్కకి భయపడి భవనంపై నుంచి దూకిన డెలివరీ బాయ్
Delivery Boy jumps off a Building in Hyderabad : చాలా మందికి కుక్కలంటే ఇష్టం. కొందరేమో వాటిని తమ సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే తమ పిల్లల్లాగా వాటి ఆలనాపాలనా చూస్తుంటారు. కానీ మరికొందరికి మాత్రం కుక్కలంటే చాలా భయం. అలా ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన డెలివరీ బాయ్.. ఆ ఇంట్లో కుక్కకు భయపడి భవనం మూడో అంతస్తుపై నుంచి దూకేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్(23) మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబరు 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న జర్మన్ షపర్డ్ శునకం మొరుగుతూ రావడంతో భయపడిన రిజ్వాన్.. మూడో అంతస్తు నుంచి కిందకి దూకాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన యజమాని శోభన వెంటనే అంబులెన్స్‌లో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు మహ్మద్ ఖాజా గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.