Fake Documents: అమెరికాలో ఉన్నత చదువుల ఆశయానికి తోడు ఉద్యోగాల ఆశల్ని పలు కన్సల్టెన్సీల నిర్వాహకులు సొమ్ముచేసుకున్నారు. వీసా కోసం జరిగే ఇంటర్వ్యూలో... ఎంపికయ్యేందుకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల్ని తామే సమకూర్చుతామని నమ్మబలికారు. తొలుత కేరళకు చెందిన ఓ కుటుంబం ఇదే తరహాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు.... దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు గుర్తించారు.
అమెరికాలో ఉండే తమ కూతురు సౌమ్య రమేశ్‌కు... కిడ్నీ దానం చేసేందుకు వెళ్తున్నట్లు తిరువనంతపురానికి చెందిన క్రిస్టోఫర్ థామస్, సిమీ పోలిన్ దంపతులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కువైట్‌లోని సిటిజన్ సూపర్ మార్కెట్ తమదేనని... నెలకు 7 లక్షల ఆదాయం వస్తుందని దరఖాస్తులో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో ఆరా తీయగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలిచ్చినట్లు బయటపడింది. ఆదే రాష్ట్రానికి చెందిన.... జైసన్ ఆగస్టీన్, జూడిత్ దంపతులూ అదే తరహాలో కిడ్నీ ఇచ్చేందుకు అమెరికా వెళ్తున్నట్లు దరఖాస్తు చేశారు. వారూ నకిలీ ధ్రవపత్రాలు సమర్పించినట్లు గుర్తించిన ఎంబసీ అధికారులు... గత నెల 15 న చాణక్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో తెలుగురాష్ట్రాల విద్యార్థుల వీసా దరఖాస్తులు రావడంతో ఎంబసీ వర్గాలు అప్రమత్తయ్యాయి . హైదరాబాద్, చెన్నైల్లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాలున్నా వీసా ఇంటర్వ్యూల కోసం దిల్లీకి రావడంతో అధికారులకు అనుమానమొచ్చింది. కేరళ ఘటన తర్వాత వీసా ఇంటర్వ్యూలలో గట్టిగా ప్రశ్నించగా తెలుగువిద్యార్థులూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమకూర్చినట్లు తేలింది. ఆ బాగోతాలపై గత నెల 24 నుంచి ఈ నెల 8 వరకు.... 11 కేసులు నమోదయ్యాయి. పలువురు విద్యార్థుల్ని ఎంబసీ అధికారులు పోలీసులకు అప్పగించారు.
బాధిత విద్యార్థుల్లో చాలామంది బీటెక్ పూర్తి చేసి ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లు ఖాళీగా ఉన్నామంటే వీసా దొరకడం కష్టమని... సాఫ్ట్‌వేర్ సంస్థల్లో లేదా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు నిర్వాహకులే నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా.... ఏజెంట్లను నియమించుకున్నారు. అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎమ్ఎస్ వంటి ఉన్నతచదువులు చదివేందుకు ఆర్ధిక స్థోమత అవసరం కావడం వల్ల లక్షల్లో బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు నకిలీ పత్రాలు సమర్పించారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి 50 వేల నుంచి లక్షా 20 వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఎంతమందికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: