తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2021, 11:00 AM IST

Updated : Jul 17, 2021, 11:45 AM IST

ETV Bharat / crime

CYBER ATTACK: బ్యాంక్​ సర్వర్​లోకి చొరబడి కోట్లు కొల్లగొట్టింది ఎందరు..?

తెలంగాణ సహకార బ్యాంక్​లో చోరీపై విచారణ కొనసాగుతోంది. బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించి రూ.1.96 కోట్లు కొల్లగొట్టింది నైజీరియన్‌ విల్సన్‌ ఒక్కడేనా? మరికొందరున్నారా? అన్న కోణంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పరిశోధిస్తున్నారు. విల్సన్​కు సహకరించిన యాసిన్‌ తీసిన ఫొటో తప్ప పోలీసుల వద్ద నైజీరియన్‌ వివరాలు ఒక్కటి కూడా లేవు. అతడు హైదరాబాద్​ వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్‌ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.

cyber attack on Telangana Cooperative Bank
cyber attack on Telangana Cooperative Bank

తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించి రూ.1.96 కోట్లు కొల్లగొట్టింది నైజీరియన్‌ విల్సన్‌ ఒక్కడేనా? మరికొందరున్నారా? అన్న కోణంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పరిశోధిస్తున్నారు. విల్సన్‌ ఉపయోగించిన సిమ్‌కార్డులను పరిశీలించిన పోలీసులు దిల్లీలోని ఫోన్‌ నంబర్లకు ఎక్కువగా కాల్స్‌ చేసినట్లు తెలియడంతో బ్యాంక్‌లో నగదు కొట్టేసేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌ బృందం కొన్ని వివరాల ఆధారంగా విల్సన్‌ బెంగళూరుకు పారిపోయుంటాడన్న అంచనాతో అక్కడికి వెళ్లనుంది.

గువహటి, దిల్లీ నుంచి సిమ్‌కార్డులు..

హైదరాబాద్‌కు రెండేళ్ల క్రితం వచ్చిన నైజీరియన్‌ విల్సన్‌ ఫోన్‌ మాట్లాడేందుకు గువహటి, దిల్లీ నుంచి మారుపేర్లతో ఉన్న సిమ్‌కార్డులను తీసుకుని ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అతడి ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా టోలీచౌకి-ఉప్పర్‌పల్లి మధ్య టవర్‌ ఉన్నట్టు గుర్తించారు. గురువారం నుంచి స్థానికుల సహకారంతో ఎక్కడెక్కడ నైజీరిన్లున్నారని వాకబు చేస్తున్నారు. విల్సన్‌ పేరుతో పాస్‌పోర్టు ఉందా? అని విచారించి ఆ పేరుతో లేదని తెలుసుకున్నారు. దీంతో విల్సన్‌ అసలు పేరుకాదన్న నిర్ణయానికి వచ్చారు. అతడికి సహకరించిన యాసిన్‌ తీసిన ఫొటో తప్ప పోలీసుల వద్ద నైజీరియన్‌ వివరాలు ఒక్కటి కూడా లేవు. అతడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్‌ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.

ఇదీచూడండి:Cyber Crime: సహకార బ్యాంక్‌లో రూ. 1.96కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్‌

ఏం జరిగిందంటే..

చదువు కోసం రెండేళ్ల క్రితం వచ్చిన నైజీరియన్‌ విల్సన్‌ ఐటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న ఈ బ్యాంకుపై కన్నేశాడు. ఈనెల 7న దాని సర్వర్లలోకి ప్రవేశించాడు. వెస్ట్రన్‌ మనీలో పనిచేసిన యాసిన్‌ బాషాను పరిచయం చేసుకున్నాడు. పద్మారావునగర్‌లో ఉంటున్న యువతితో కో-ఆపరేటివ్‌ బ్యాంకు సికింద్రాబాద్‌ శాఖలో ఈనెల 2న ఒక ఖాతాను యాసిన్‌, అతడి సోదరుడు మహ్మద్‌ రఫీతో 12న చందానగర్‌ శాఖలో మరో రెండు అకౌంట్‌లను తెరిపించి స్వాహా పర్వాన్ని సాగించాడు.

కొల్లగొట్టే సొమ్మును మూడు ఖాతాలకు మళ్లించాలని నైజీరియన్‌ విల్సన్‌ నిర్ణయించాడు. ఈనెల 7న సాయంత్రం నుంచి బ్యాంకు నుంచి యువతి ఖాతాలోకి నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా దఫదఫాలుగా రూ.1.94 కోట్లు జమచేశాడు. రఫీ ఖాతాలో 12వ తేదీ ఉదయం రూ.2 లక్షలు బదిలీ చేశాడు. యాసిన్‌ అకౌంట్‌లో వంద రూపాయలు వేసి మళ్లీ వెనక్కు తీసేసుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం యువతి ఖాతాలోని నగదును హరియాణ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలోని జాతీయ, కార్పొరేట్‌, ప్రైవేటు బ్యాంకుల్లోని వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. రఫీకి వాట్సప్‌ సందేశం పంపించి రూ.2 లక్షలు తీసుకురావాలన్నాడు. అతడు ఆ రూ.2 లక్షలను హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలోకి బదిలీ చేసి, విత్‌డ్రా చేశాడు. సోమవారం మధ్యాహ్నం విల్సన్‌కు అందజేశాడు. ఇలా చేసినందుకు రఫీ రూ.20 వేలు కమీషన్‌ తీసుకున్నాడు.

నగదు లావాదేవీల పరిమితి రూ.6 కోట్లకు..

ఈనెల 7న ప్రధాన సర్వర్‌లోకి సులువుగా ప్రవేశించిన విల్సన్‌ ఖాతాదారులకు నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఒక రోజులో నగదు బదిలీ చేసేందుకు.. అలాగే డిపాజిట్‌ స్వీకరించేందుకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలని గుర్తించాడు. సాఫ్ట్‌వేర్‌ను మార్చి తమ మూడు ఖాతాల పరిమితిని రూ.6 కోట్లకు పెంచాడు. ఈనెల 12న అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించగా, చందానగర్‌, సికింద్రాబాద్‌లోని మూడు ఖాతాలకు ప్రధాన శాఖ నుంచి డబ్బు బదిలీ అయినట్టు గుర్తించారు. వాటి నుంచి మరో 102 ఖాతాలకు మళ్లించినట్లు తెలుసుకున్నారు.

ఇదీచూడండి:Cyber Fraud: ఆయుర్వేద ఫార్ములా కొంటానని నమ్మించి.. దొరికినంతా దోచేసి..

Last Updated : Jul 17, 2021, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details