హన్మకొండ జిల్లా పరకాలలో ఓ ఇంట్లో ఫ్రిజ్‌లో మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. 90 ఏళ్ల వృద్ధుడు... విగతజీవిగా రిఫ్రిజిరేటర్లో కనిపించడంతో... ఊరూవాడా భయాందోళనలకు గురైంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి... దర్యాప్తు చేపట్టారు. అంత్యక్రియలకు డబ్బుల్లేకే...తాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచినట్లు మనుమడు నిఖిల్ చెపుతున్నాడు.
dead body in refrigerator: ఫ్రిజ్‌లో 90 ఏళ్ల వృద్ధుడి మృతదేహం.. మనుమడే దాచాడటా..!
15:34 August 12
dead body in refrigerator: ఫ్రిజ్‌లో 90 ఏళ్ల వృద్ధుడి మృతదేహం
కామారెడ్డికి చెందిన బాలయ్య అనే వృద్ధుడు సగర వీధిలో మనువడు నిఖిల్‌తో కలిసి అద్దెకుంటున్నాడు. మూడు రోజుల క్రితం నుంచి బాలయ్య ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో... చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ శివరామయ్య, సీఐ మహేందర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని అంతా పరిశీలించారు. ఫ్రిజ్‌లో నుంచే వాసన వస్తుందని గమనించి తలుపు తీసి చూడగా.. పెద్దాయన మృతదేహం బయటపడింది. పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయిన ఆ మృతదేహాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైరి బాలయ్య విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. తన కొడుకు, కోడలు, భార్య ఇంతకుముందే చనిపోయారు. అప్పటి నుంచి తన మనుమడు నిఖిల్‌తో కలసి సగర వీధిలో నివాసం ఉంటున్నాడు. ఫించన్ డబ్బులతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య అనారోగ్యానికి గురయ్యాడు. సరైన వైద్యం అందకపోవటం వల్ల బాలయ్య మరణించాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతోనే... మృతదేహాన్ని ఫ్రిజ్లోనే దాచిపెట్టినట్టు మనుమడు నిఖిల్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసును ఏసీపీ శివరామయ్య, సీఐ మహేందర్ రెడ్డి విచారిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్నివరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం... వృద్ధుడి అంత్యక్రియలకు ఇంటి యజమాని సాయం అందించారు. అయితే అంత్యక్రియలకు డబ్బుల్లేవని మనుమడు చెబుతున్న కారణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే.. విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:MPDO Nuisance: గరుగుబిల్లి ఎంపీడీఓ వికృత చేష్టలు.. సస్పెన్షన్ వేటు