రోజూ కలిసే వ్యక్తి ఓ రోజు కనిపించకపోతేనే.. ఆరా తీస్తాం. అలాంటిది తన తమ్ముడు మూడు రోజులుగా తనను కలవట్లేదు. మరీ ఆ అన్నకు తెలుసుకోవాలని ఉండదా..? అసలు ఏమైంది..? తమ్ముడు ఎందుకు కలవట్లేదో... తెలుసుకుందామని ఇంటికి పోయిన అన్న తమ్మున్ని చూసి షాక్ అయ్యాడు. అలాంటి దృశ్యం చూస్తానని ఆ అన్న కలలో కూడా ఊహించలేదు. ఆ అన్న ఏం చూశాడో తెలుసుకోవాలంటే.. మొదట ఆ తమ్ముని కథ తెలుసుకోవాల్సిందే..
రెండేళ్లుగా మద్యానికి బానిసై..
ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండలం జామిడి గ్రామానికి చెందిన వ్యక్తి హారన్ సందీప్. అతడికీ.. మహారాష్ట్రలోని మలక్వాడికి చెందిన ప్రతిభతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇంటి వద్దే కిరాణా దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహమై ఎనిమిదేళ్లు గడిచినా సందీప్‌కు సంతానం కలగలేదు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. ఇంకెన్ని మందులు వాడినా.. సందీప్ దంపతులకు మాత్రం సంతానభాగ్యం కలగలేదు. పిల్లలు పుట్టటం లేదన్న బాధతో.. రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు సందీప్.
భార్య దగ్గరికి వెళ్లొచ్చాక...
మొన్నటి దీపావళి పండుగకు భార్య ప్రతిభ పుట్టింటికి వెళ్లింది. అనంతరం సందీప్ కూడా.. ఈ నెల 9న భార్యను చూసేందుకు మలక్వాడి వెళ్లాడు. అక్కడే రెండు రోజులు ఉండి.. తిరిగి ఈ నెల 11న ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి సందీప్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. తన అన్న రాజేందర్‌ను కూడా కలవలేదు. తన భార్యకు కూడా ఫోన్ కూడా చేయలేదు.