మాతోపాటు ఉంటున్న కోడలు మా వ్యాపారాన్ని కొడుకుతో సహా సొంతం చేసుకున్నా ఏమీ అనలేదు.. వృద్ధులైన మమ్మల్ని వేధిస్తున్నా(Daughter-in-law harassment) భరించాం.. ఇంట్లో బంగారు ఆభరణాలు, వారసత్వ వస్తువులు కనిపించకపోతే.. తీసుకున్నది కోడలు.. కొడుకేనని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేశాం... మేం మాట్లాడే ప్రతిమాటా విని కక్ష తీర్చుకుంటోందని తెలుసుకున్నాక అక్కడ ఉండడం మా ప్రాణాలకే ప్రమాదమని తెలిసి పోలీసులను ఆశ్రయించాం’’ అని కరీంనగర్‌కు చెందిన వైకుంఠం పోలీస్ అధికారులకు తెలిపాడు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులమైన తాము అప్పట్లో ఫిర్యాదు చేసేందుకు రాలేదంటూ పోలీసులకు చెప్పాడు. కరీంనగర్‌లో తమకు వస్త్ర దుకాణం ఉందని, నలుగురు కుమారుల్లో ఒకరు అమెరికా, మరొకరు బెంగళూరు, ఇంకొకరు హైదరాబాద్‌లో ఉన్నారని వీరంతా ఉద్యోగాలు చేస్తుండగా.. తమతో పాటు ఉంటున్న కుమారుడు, కోడలు మాత్రం తమ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్నేళ్ల నుంచి వేధిస్తున్నారని వివరించాడు.
వీలునామా మాటలతో మరింత ఆగ్రహం..
వైకుంఠం, ఆయన భార్యను వారి కోడలు ఆస్తి విషయంలో వేధిస్తోంది. కొడుకుతో ఈ విషయం చెప్పినా.. ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని మరో కుమారుడితో తమ బాధలను పంచుకునేవారు. సరిగ్గా అప్పుడే వీరి మాటలు వినేందుకు వైకుంఠం చరవాణిలో రికార్డింగ్ మైకాల్ యాప్‌ను(recording my call app) డౌన్‌లోడ్ చేసింది. వైకుంఠం ఫోన్లో మాట్లాడే మాటలు వినేందుకు ఆ యాప్‌ను గూగుల్ క్లౌడ్ ద్వారా తన ఈ-మెయిల్‌కు అనుసంధానం చేసుకుంది. వైకుంఠం మాట్లాడే ప్రతిమాటా విని తన గురించి ఏదైనా మాట్లాడితే.. వెంటనే వారిపై కోప్పడేది. భోజనం సరిగా పెట్టేది కాదు.. వీలునామా రాద్దామని భావిస్తున్నానని, కరీంనగర్‌లో రాయిస్తే.. ఇద్దరికీ తెలిసిపోతుందని హైదరాబాద్‌లోని కొడుకుకు వివరించగా... తనవద్దకు రావాలని సూచించాడు. ఈ మాటలు విన్న కోడలు మరింత ఆగ్రహంతో వేధింపులు తీవ్రం చేసింది.