Dating App Frauds : విద్యార్థులు, యువకులు, వయోధికులు వయసుతో సంబంధం లేకుండా వలపు వలకు చిక్కుతున్నారు. కొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే.. అధికశాతం సొమ్ము పోయినా పరువు మిగిలితే చాలని మౌనంగా ఉంటున్నారు. డేటింగ్ యాప్‌ల ఉచ్చులో పడి మోసపోయామంటూ మూడు పోలీసు కమిషనరేట్లలో 6 నెలల వ్యవధిలో 20-25 వరకూ ఫిర్యాదులు వచ్చాయి.
Dating App Frauds : వలపు వల.. చిక్కితే విలవిల - తెలంగాణలో డేటింగ్ యాప్ ఫ్రాడ్స్
Dating App Frauds : డేటింగ్ యాప్ మోజులో పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు హనీట్రాప్‌లో చిక్కుతున్నారు. డేటింగ్ యాప్‌లో అమ్మాయిల గొంతుతో మాట్లాడే వారి మాయలో పడి కష్టపడి సంపాదించినదంతా వారికి కట్టబెట్టేస్తున్నారు. చివరకు మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
భారీ ఎత్తున సొమ్ము కొట్టేస్తూ..దేశ, విదేశాలకు చెందిన కొన్ని అంకుర సంస్థలు డేటింగ్ యాప్స్‌ను నిర్వహిస్తున్నాయి. నిర్ణీత ఫీజు వసూలు చేస్తూ సేవలు అందిస్తున్నాయి. దీన్ని అవకాశం చేసుకొన్న సైబర్ మాయగాళ్లు, మోసగాళ్లు డేటింగ్ యాప్‌లతో అమాయకుల నుంచి భారీ ఎత్తున సొమ్ము కొట్టేస్తున్నారు. గతేడాది విజయవాడకు చెందిన భార్యాభర్తలు డేటింగ్ యాప్ ద్వారా హైదరాబాద్ యువకుడిని నమ్మించి రూ.21 లక్షలు కాజేశారు. నకిలీ ఖాతా సృష్టించి వేరే యువతి ఫొటో ద్వారా ఛాటింగ్ చేస్తూ పెళ్లి పేరుతో నిలువు దోపిడీ చేశారు. ఇటీవల ఓ వైద్యుడు రూ.కోటి వరకూ డేటింగ్ యాప్ మోజులో కోల్పోయారు.
నకిలీ యాప్‌లతో..ఈ తరహా యాప్‌లకు విపరీత డిమాండ్ ఉండటంతో నకిలీవి పుట్టుకొచ్చాయి. దిల్లీ, రాజస్థాన్, హరియాణాకు చెందిన సైబర్‌ముఠాలు డేటింగ్‌యాప్‌ల ముసుగులో మగవాళ్లను ఆకర్షిస్తున్నాయి. ఆడగొంతుతో మాట్లాడుతూ.. అవతలి వైపు ఉన్నది అమ్మాయిలే అనే నమ్మకం కలిగిస్తారు. వలలో చిక్కిన వారి నుంచి దఫాల వారీగా రూ.లక్షలు కాజేస్తున్నారు. మోసపోతున్న వారిలో కేవలం 1-2శాతం మంది మాత్రమే ఫిర్యాదు చేస్తున్నట్టు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఏసీపీ జి.శ్రీధర్ తెలిపారు. 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.