Dastagiri a key witness: వైఎస్. వివేకానందరెడ్డి హత్యకేసులో A-4గా ఉంటూ ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి... సీబీఐకి కీలక సమాచారం అందించాడు. అప్పటినుంచి పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వైకాపా నాయకుల నుంచి బెదిరింపులు అధికమయ్యాయని దస్తగిరి చెబుతున్నాడు. ఈ పరిస్థితుల్లోనే తనకు ముప్పు ఉందని అభ్యర్థించడంతో.... ఆరు నెలల నుంచి "వన్ ప్లస్ వన్" గన్‌మెన్లతో భద్రత కల్పిస్తున్నారు. అయినా వైకాపా నాయకుల నుంచి బెదిరింపులు ఆగలేదంటూ... సీబీఐ అధికారులతోపాటువైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. వీటన్నింటికి తోడు... తొండూరు మండలం మల్యాలలో వ్యవసాయ పరికరాలు, ఐస్ మిషన్ చోరీ, తమ బంధువులతో ఉద్దేశపూర్వక గొడవలు పెట్టుకోవడం లాంటి ఘటనలు జరిగాయి ఆ తర్వాత కొన్నాళ్లకు తొండూరు పోలీస్ స్టేషన్‌లోనే వైకాపా నాయకులకు, దస్తగిరికి మధ్య ఘర్షణ తలెత్తింది.
కడపలో సీబీఐ: కడపలో మకాం వేసిన సీబీఐ అధికారులను నాలుగు రోజుల నుంచి వరుసగా కలిసి.. తనకు జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న దస్తగిరి.. గురువారం కూడా పులివెందులలో మీడియాతో మాట్లాడి.. మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల కళ్లెదుటే ఈ గొడవ జరిగినా తనకు అండగా నిలవలేదని దస్తగిరి వాపోయాడు. ఈ క్రమంలోనే వివేకా హత్యకేసును తనపై వేసుకుంటే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నాడంటూ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి.. రెండు నెలల కింద అనంతపురం జిల్లా యాడికిలో మృతి చెందాడు. సిట్ విచారణ సమయంలో సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి... ముఖ్యమంత్రివైఎస్. జగన్, ఆయన బంధువు వైఎస్. భాస్కర్‌రెడ్డికి లేఖలు రాసి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలన్నీ గుర్తుచేసుకుంటున్న దస్తగిరి... తనకు ప్రాణాపాయం తప్పదని ఆందోళన చెందుతున్నాడు.