లబ్దిదారులకి కాకుండా ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాల్లోకి దళిత బంధు నిధులు వెళ్లిన విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. క్లరికల్ సమస్య వల్ల ఇతరుల ఖాతాల్లో జమకావడంతో ఆ నిధులను తిరిగి ఇవ్వకుండా ఖర్చుపెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై ఎస్బీఐ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. గత నెల26న ఎస్సీ కార్పొరేషన్ దళిత బందు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలంటూ లక్డీకాపూల్లోని రంగారెడ్డి జిల్లా ఎస్బీఐ కలెక్టరేట్ శాఖకి రూ.7 కోట్ల 44 లక్షలు బదిలీ చేసింది.
అందులో 15 మంది లబ్ధిదారులకు చేరాల్సిన నిధులు క్లరికల్ తప్పిదంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన 15 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి వెళ్లాయి. తప్పిదాన్ని గ్రహించి విచారణ చేసిన బ్యాంకు సిబ్బంది 14 మంది నుంచి సొమ్ము రికవరీ చేశారు. ఓ ఉద్యోగి మాత్రం 9 లక్షల 90 వేలు వాడుకున్నాడు. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.