‘‘హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న బల్వీందర్ సింగ్.. తన ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖాతాలో(indus bank account) లావాదేవీలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అంతర్జాలంలో ఉన్న కస్టమర్ కేర్ నంబరుకు ఫోన్ చేశారు. అది సైబర్ నేరస్థులు ఉంచిన నకిలీ నంబరని తెలియదు. అవతలి వ్యక్తులు ‘మంకీ సర్వే’ (monkey survey app) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని బల్వీందర్‌కు చెప్పారు. తర్వాత డెబిట్ కార్డు వివరాలు పూర్తి చేయించి.. ఓటీపీ చెప్పమన్నారు. బల్వీందర్ ఓటీపీ చెప్పగానే ఆయన ఖాతాలోంచి రూ.4.5 లక్షలు నగదు మాయమైంది’’ ఇలా డెబిట్, క్రెడిట్ కార్డుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్థులు వంచనకు దిగుతున్నారు.
స్కాం సూత్రం ఇదే..
ప్రభుత్వ సంస్థల పనితీరు, ప్రజాభిప్రాయం, రాజకీయనేతల ప్రస్తుత, భవిష్యత్‌పై సర్వేలు నిర్వహిస్తున్న ‘మంకీ సర్వే’ యాప్‌ను మోసాలకు వినియోగిస్తున్నారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ వంటి బ్యాంకుల కస్టమర్ కేర్, కేవైసీలను సంప్రదిస్తున్న వారికోసం అంతర్జాలంలో ఆ బ్యాంకుల తరహాలోనే టోల్‌ఫ్రీ నంబర్లను ఉంచుతున్నారు. ఈ నంబర్లకు ఫోన్ చేసిన వెంటనే స్పందించి.. మంకీ సర్వే యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఆ యాప్‌లో ఒక ఫారంలా ఉన్న డిజిటల్ కాగితంలో పేరు, డెబిట్‌కార్డు నంబరు, సీవీవీ ఇలా అన్ని వివరాలను పూర్తిచేశాక ఆ ఫారాన్ని పంపమంటున్నారు. ఆ వివరాలను తీసుకుని నగదు బదిలీ, ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ వస్తువుల ఓచర్లను బాధితుల ఓటీపీలతో కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరు, ముంబయి నగరాల్లో కొద్దిరోజుల్లోనే 35 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.