Cyber criminals in India : దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో పంథాకు తెరతీశారు. ‘అంచెలంచెలు’గా డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇందులో వ్యూహం పన్నేది ఒకరైతే సాంకేతిక సాయం అందించేది మరొకరు.. డబ్బు దోచుకునేది ఇంకొకరు. ఒకరితో మరొకరికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇలాంటి నేరాలను సైబర్ నిపుణులు ‘మాడ్యులర్ ఎటాక్స్’గా పిలుస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరాల దర్యాప్తులో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న పోలీసులకు దీంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
‘మ్యూల్ ఖాతాల’ ద్వారా: ఫోన్ ద్వారా మాయమాటలు చెప్పి బోల్తాకొట్టించే నేరగాళ్లు, అలా కొల్లగొట్టిన డబ్బును అమాయకుల ఖాతాల్లో పడేలా చేస్తారు. వీటిని ‘మ్యూల్ అకౌంట్స్’ అంటారు. ఊళ్లలో నిరుపేదలు, నిరక్షరాస్యుల బ్యాంకు ఖాతాలను ఇందుకోసం వాడుకుంటారు. వారి డెబిట్‌కార్డులను తమవద్ద పెట్టుకొని.. డబ్బు ‘మ్యూల్ ఖాతా’ల్లో పడగానే నేరగాళ్లు డ్రా చేసుకుంటారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినా బాధితులకు వచ్చిన ఫోన్ నంబర్లలో తప్పుడు చిరునామాలు ఉంటాయి.
డబ్బు జమ అయిన ఖాతా చిరునామా ఆధారంగా ఖాతాదారును పట్టుకున్నా, నేరంతో ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరో అపరిచితుడు తన ఖాతా వాడుకున్నాడని, ప్రతిఫలంగా కొంత డబ్బు ముట్టచెప్పాడని చెబుతుంటారు. సైబర్ నేరాలకు అడ్డాలుగా మారిన ఝార్ఖండ్‌లోని ఝాంతారా, రాజస్థాన్‌లోని భరత్‌పుర్ తదితర ప్రాంతాల్లో ఇలా మ్యూల్ ఖాతాలు సేకరించిపెట్టే ముఠాలు పనిచేస్తున్నాయి. కొందరు బ్యాంకు అధికారులతోనూ సంబంధాలు పెట్టుకొని, నిరుపయోగంగా ఉన్న ఖాతాలను సేకరించి నేరగాళ్లకు చేరవేస్తుంటారు.
ఆర్థిక సంస్థలు లక్ష్యంగా:వ్యక్తుల ఖాతాల్లోని డబ్బు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలనూ లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాటి నెట్‌వర్క్‌లోకి చొరబడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. గత ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని ఏపీ మహేష్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ సర్వర్‌లోకి చొరబడిన నేరగాళ్లు రూ.12 కోట్ల మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు.
ఈ ఖాతాలన్నీ అమాయకులవే కావడం గమనార్హం. అంతకుముందు తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి రూ.1.98 కోట్లు కొల్లగొట్టారు. వీటితోపాటు ఇంకొన్ని ప్రైవేటు బ్యాంకులను కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఈతరహా కేసులు పెరుగుతుండగా.. చాలా సంస్థలు పరువు పోతుందన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది.