తెలంగాణ

telangana

ETV Bharat / crime

Naga shaurya farm house case: 'పేకాడదాం రండి'.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు - తెలంగాణ వార్తలు

మంచిరేవుల ఫాంహౌస్​ కేసు(Naga shaurya farm house case) విచారణలో భాగంగా గుత్తా సుమన్‌కుమార్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. చూడగానే ఆకట్టుకునేలా సిద్ధం చేసిన కార్డులను పంపించి పేకాట ఆడేందుకు రావాలని ప్రముఖులను గుత్తా సుమన్‌కుమార్‌ ఆహ్వానించేవాడని సైబరాబాద్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. విజయవాడ మామిడితోటల నుంచి కొలంబో వరకు అతని ప్రయాణం సాగిందని తెలిపారు.

Naga shaurya farm house case, playing cards case
నాగశౌర్య పాంహౌస్ కేసు వార్తలు, పేకాట కేసు వార్తలు

By

Published : Nov 3, 2021, 11:53 AM IST

సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు ఆహ్వాన పత్రికలను పంపిస్తుంటారు. చూడగానే ఆకట్టుకునేలా సిద్ధం చేసిన కార్డులను పంపించి పేకాట ఆడేందుకు రావాలని గుత్తా సుమన్‌కుమార్‌ ఆహ్వానించేవాడని సైబరాబాద్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. రంగు రంగుల విద్యుద్దీపాలు.. ఖరీదైన మద్యం.. అధునాతన సౌండ్‌ సిస్టం.. సహాయకులుగా అమ్మాయిలను ఏర్పాటు చేసేవాడని గుర్తించారు. ఆర్థిక స్థితి ఆధారంగా కస్టమర్లను ప్రత్యేక కేటగిరీలుగా విభజించి క్యాంప్‌లను నిర్వహించేవాడని తేలింది. అక్కడి ఏర్పాట్లకు అనుగుణంగా ప్రవేశ రుసుం రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవాడని వెల్లడయ్యింది.

ఆర్థిక స్థితి ఆధారంగా కేటగిరీలు..

గండిపేట మండలం మంచిరేవులలో ఫాంహౌస్​లో(Naga shaurya farm house case) ఆదివారం పేకాటాడుతూ 30 మంది పోలీసులకు చిక్కిన సంగతి విదితమే. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులుండటం కలకలం రేపింది. విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఇతని లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులతో నిత్యం టచ్‌లో ఉండేవాడు. విదేశాల్లోని పలు క్యాసినోల నిర్వాహకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అక్కడి అనుభవంతోనే ఇక్కడ రెస్టారెంట్లను అద్దెకు తీసుకుని క్యాసినోలు నిర్వహించాడు. విజయవాడ మామిడితోటల నుంచి కొలంబో వరకు అతని ప్రయాణం సాగింది. సుమన్‌ బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు’ అని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.

రెండ్రోజుల కస్టడీకి అనుమతి...

గుత్తా సుమన్‌కుమార్‌ మినహా మిగిలిన 29 మందికి మంగళవారం రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుమన్‌ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. చర్లపల్లి జైలు నుంచి బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. లీజు దస్తావేజులతో రావాలని సూచించినా టాలీవుడ్‌ హీరో నాగశౌర్య తండ్రి మంగళవారం కూడా హాజరుకాలేదు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు..

విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆగస్టు 15న గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతూ సైబరాబాద్‌ పోలీసులకు చిక్కినట్టు కూడా గుర్తించారు. ‘సుమన్‌కుమార్‌ చుట్టూ బాడీగార్డులను పెట్టుకుని ప్రముఖుడిగా చలామణి అవుతుంటాడు. పెద్దవాళ్లతో పరిచయం ఉందని చెబుతూ ఎందరినో మోసం చేశాడు. భూకబ్జాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాం. మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయి నుంచి ఫాంహౌస్​లు, స్టార్‌హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో గదులను అద్దెకు తీసుకుని ప్రత్యేక క్యాంప్‌(casino hyderabad news)లను ఏర్పాటుచేసే స్థాయికొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటుచేశాడు. స్థిరాస్తి వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. ఓ న్యూస్‌ ఛానెల్‌కు డైరెక్టర్‌గానూ పనిచేశాడు. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భారీగా మోసాలకు పాల్పడ్డాడు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. మరో గంట వేచిఉంటే ఫాంహౌస్​లో పేకాట ఆడేందుకు మరికొందరు ప్రముఖులు వచ్చేవారన్నారు.

ఇదీ చదవండి:Naga Shaurya farm house case: పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి

ABOUT THE AUTHOR

...view details