రాయదుర్గం పీఎస్ పరిధిలో ఆరు రోజుల కిందట జరిగిన చోరీ కేసులో నేపాల్‌కు చెందిన దంపతులను (Nepal Couples) అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర (Cyberabad Cp Stephen Ravindra)తెలిపారు. టెలికాంనగర్‌లో నివాసం ఉండే గోవిందరావు... ఐదు నెలల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులను పనిలో పెట్టుకున్నాడని తెలిపారు. ఈనెల 18న అతను కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లినప్పుడు... నేపాల్ దంపతులు చోరీకి పాల్పడినట్లు సీపీ స్టీఫెన్ తెలిపారు.
నేపాల్‌లోని కలికోట్ జిల్లాకు చెందిన బహదూర్ షాహి, పవిత్ర దంపతులు 110 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని గోవిందరావు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలించారు. నేపాల్ పారిపోవచ్చనే ఉద్దేశంతో సరిహద్దులోనూ నిఘా పెట్టారు. సాంకేతికత ఆధారంగా నిందితులిద్దరూ షోలాపూర్‌లో ఉన్నట్లు నిర్ధరించుకొని ఓ పోలీస్ బృందం అక్కడికి వెళ్లింది. రైల్వే స్టేషన్లో ఉన్న నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి 110 తులాల బంగారం, రూ.7.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
'నిందితులు నేపాల్‌కు చెందినవారు. వీళ్ల వెంటనే ట్రాక్ చేయకపోతే తప్పించుకునే అవకాశం ఉందని నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ టీమ్స్‌ను షోలాపూర్, ముంబయి, లఖ్‌నవూ, సిమ్లా పంపించాం. పక్కా సమాచారంతో నేపాల్‌కు చెందిన లక్ష్మణ్, అతని భార్య పవిత్రను షోలాపూర్ రైల్వేస్టేషన్ దగ్గర అరెస్ట్ చేశాం.'