అవధులు లేని శృంగారం... ఆనందం అంటూ వాట్సప్ కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుతూ తర్వాత వీడియోలు తీసి బెదిరిస్తున్న కేటుగాళ్ల గుట్టు(cyber gang) రట్టయింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని అనంతరం వాట్సప్ వీడియోల్లో నగ్నంగా మాట్లాడుతున్నట్టు నకిలీ వీడియోలు సృష్టించి డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ భరత్‌పూర్‌కు చెందిన ముఠా... ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు.
అందంతో ఆకర్షిస్తూ.. కోట్లల్లో కాజేస్తూ..
అంతర్జాలంలో అశ్లీల వీడియోలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని... వాటికి వాయిస్‌ను మార్చి... మోసాలకు పాల్పడున్న సైబర్ కేటుగాళ్ల వివరాలు, సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. పదోతరగతి కూడా ఉత్తీర్ణులు కాని నేరగాళ్లు... వేల మందిని బెదిరించి రెండు నెలల్లో 25 కోట్ల రూపాయలకు పైగా దండుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేటుగాళ్ల ముఠా బాధితులు 18 రాష్ట్రాల్లో ఉన్నారంటే ఎంత మంది వీరి బారిన పడి ఉంటారో అర్థమవుతోంది. ఈ ముఠా కోసం ఇప్పటికే బెంగళూరు, ముంబయి, చెన్నై పోలీసులు గాలిస్తున్నారు. ముఠాలో 18 మందిని హైదరాబాద్ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు.
యువతే లక్ష్యంగా..
సామాజిక మాధ్యమాల ద్వారా మెట్రో నగరాల్లో ఉంటున్న యువకులను, వృత్తి నిపుణులను ఎంపిక చేసుకొని వల విసురుతున్నారు. ఒకటి రెండు రోజులు సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడి... అనంతరం వారి వాట్సప్ నంబర్లు తీసుకుంటున్నారు. వాట్సప్ కాల్ మొదలయిన వెంటనే దుస్తులను తొలగించి నగ్నంగా మారుతున్నారు. ఇదంతా సాంకేతిక మాయాజాలం. చరవాణిలో అప్పటికే డౌన్లోడ్ చేసుకున్న అశ్లీల వీడియోల్లో ఒకదానిని పంపుతున్నారు. పెదాల కదిలికలకు అనుగుణంగా వాయిస్ చేంజ్ యాప్ ద్వారా అమ్మాయిల్లా మాట్లాడుతున్నారు. ఒకటి రెండు రోజులు నగ్న వీడియోల ద్వారా మాట్లాడిన తర్వాత... మీరు కూడా నగ్నంగా మాట్లాడండి అంటూ కోరుతున్నారు.