Hyderabad Cyber crime : సైబర్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్‌సైట్లు, కాల్‌సెంటర్లు, క్యూఆర్‌కోడ్స్.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో జనవరిలో 500కుపైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. 2023తో నేరస్థులు ట్రెండ్ మార్చారు. యువతీ, యువకులే లక్ష్యంగా కొత్త పంథాలో పంజా విసురుతున్నారు.
గాజులరామారానికి చెందిన ఐటీ నిపుణురాలి (26)కి పశ్చిమగోదావరి జిల్లా యువకుడినంటూ ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదికలో పరిచయమయ్యాడు. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరయ్యారు. తన బ్యాంకు ఖాతాలు నిలిపివేశారంటూ ఆ యువతి నుంచి దఫాల వారీగా రూ.34 లక్షలు కొట్టేశాడు.
ఆర్టీసీ కాలనీ యువతి (25)కి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మిత్రుడు.. కొన్నాళ్ల తరువాత లండన్ నుంచి బహుమతి పంపినట్లు యువతి వాట్సాప్‌కు సమాచారమిచ్చాడు. ముంబయి కస్టమ్స్ కార్యాలయానికి చేరిన బహుమతిని తీసుకొనేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.1.24 లక్షలు కాజేశారు. మల్లేపల్లికి చెందిన యువతి(24)కి వాట్సాప్ ద్వారా శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.లక్ష తీసుకొని ముఖం చాటేశారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ మాదాపూర్‌లోని ఐటీ నిపుణుడికి రూ.28 లక్షలు టోకరా వేశారు.