తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇన్‌స్టాలో ఇష్టమంటే.. రూ.15 లక్షలు ఇచ్చేసింది - cyber news

అందమైన యువకుడు.. యూకేలో ఉన్నతోద్యోగం. డబ్బుకు ఢోకా లేదు. ఇలా సామాజిక మాధ్యమాల్లో కనిపించిన ఫొటో చూసి నిజమని భావించి రూ.లక్షలు మోసపోయిన బాధితురాలు శుక్రవారం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Cyber Crime
Cyber Crime

By

Published : May 28, 2022, 10:45 AM IST

హైదరాబాద్​ నగరానికి చెందిన ఓ మహిళ(30) కార్పొరేట్‌ సంస్థలో కొలువు చేస్తున్నారు. కొద్దికాలం కిందట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను యూకేలో ఉంటున్నట్లు నమ్మించి స్నేహం చేశాడు. తనకు యూకేలో బోలెడన్ని ఆస్తిపాస్తులున్నాయని.. అసలు సిసలైన భారతీయ యువతిని పెళ్లి చేసుకొనేందుకు అన్వేషిస్తున్నట్లు చెబుతూ నువ్వే సరైన జీవిత భాగస్వామివంటూ ఆశపెట్టాడు. యూకే నుంచి రూ.కోటికిపైగా విలువైన బహుమతులు పంపుతున్నానంటూ ఆమెకు చెప్పాడు. తర్వాత రెండు రోజులకు కస్టమ్స్‌ అధికారినంటూ ఓ వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్‌కాల్‌ వచ్చింది. బహుమతులు తీసుకొనేందుకు కస్టమ్స్‌, జీఎస్‌టీ తదితర పన్నుల పేర్లతో దఫాల వారీగా రూ.15 లక్షలు వేర్వేరు ఖాతాల్లో జమచేయించుకున్నారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలకు చెందిన వారిగా కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులతో పరిచయం చేసుకుంటారు. ఆయా దేశాల నుంచే మాట్లాడుతున్నట్లు నమ్మించేందుకు అక్కడి ఫోన్‌ నంబర్లు ఉపయోగిస్తున్నారు. దాంతో బాధితులు తేలిగ్గా బుట్టలో పడిపోతున్నారని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ జి.శ్రీధర్‌ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో చాలా మంది మౌనంగా ఉండిపోతున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details