Cyber crime: సకల సమాచారం అందుబాటులో ఉండే గూగుల్ మాటున సైబర్ నేరాలు కొత్తకాదు. అచ్చం అసలు వెబ్‌సైట్‌నే పోలినట్లుండే నకిలీది రూపొందించి దాని ద్వారా నేరాలకు పాల్పడుతుండటం చాలాకాలంగా జరుగుతూనే ఉంది. అయితే, పదేపదే ఇలాంటి నేరాలు జరుగుతుండటంతో జనం అప్రమత్తమై జాగ్రత్తగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు నేరగాళ్లు కొత్త ఎత్తులకు పాల్పడుతున్నారు. కవ్వించి మరీ ముగ్గులోకి దింపుతున్నారు. పాపప్ మెనూలతో గారడీ చేస్తూ.. ఖాతాల్లో ఉన్న సర్వం ఊడ్చేస్తున్నారు.
ఖాతాలు ఖాళీ..:హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్(పేరు మార్చాం)కు అమెరికా నుంచి ఆయన మిత్రుడు కొరియర్‌లో ఓ ఖరీదైన బహుమతి పంపారు. రోజులు గడుస్తున్నా అది అందకపోవడంతో సదరు కొరియర్ సంస్థ చిరునామా కోసం ఆయన గూగుల్ సెర్చ్ మొదలుపెట్టారు. ఈ సంస్థ పేరు కొట్టగానే కంప్యూటర్ తెరపై అదే పేరుతో ఓ పాపప్ మెనూ ప్రత్యక్షమైంది. సాంకేతిక కారణాల వల్ల బహుమతి ఆగిపోయిందని, కొద్దిమొత్తం చెల్లిస్తే వెంటనే డెలివరీ చేస్తామని అటునుంచి సమాధానం వచ్చింది. ఎలా చెల్లించాలని ప్రవీణ్ అడగ్గానే అటువైపు నుంచి ఓ క్యూఆర్ కోడ్ పంపారు. ప్రవీణ్ ఆ కోడ్ తెరిచిన కొద్దిసేపటికే ఆయన ఖాతాలో ఉన్న రూ.1.5 లక్షలు ఖాళీ అయ్యాయి. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.