హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఉంటున్న ఓ యువ వైద్యురాలికి కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాలో ప్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రొఫైల్‌ను చూస్తే.. తనకు సంబంధించిన రంగంలో ఉన్న వ్యక్తే అనిపించి రిక్వెస్ట్‌ను అక్సెప్ట్ చేసింది. ఇద్దరి మధ్య పరిచయం కుదిరింది. తాను లండన్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో హార్ట్ స్పెషలిస్ట్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు చాట్ చేసుకున్నారు. తన ఆసుపత్రికి సంబంధించిన విషయాలన్నింటినీ ఆమెకు వివరించాడు. తమ మూలాలు భారత్‌లోనే ఉన్నాయని.. ఉత్తరాఖండ్‌లోని ఓ నగరం పేరు చెప్పాడు. ఇలా ఇద్దరి మధ్య చాలా సంభాషణ జరిగి.. మంచి మిత్రులయ్యారు. "మీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం పెళ్లి చేసుకుందాం.. హైదరాబాద్‌లోనే ఆస్పత్రి నిర్మించి గుండెజబ్బులతో బాధపడుతున్న పేదలకు సేవచేద్దాం.." అని తన అభ్యర్థనను ఆమె ముందుంచాడు. అతడి ఉద్దేశం నచ్చి.. యువవైద్యురాలు కూడా పెళ్లికి సరేనంటూ పచ్చజెండా ఊపేసింది.
"మన నిశ్చితార్థానికి గుర్తుగా 20 వేల డాలర్ల విలువైన వజ్రపుటుంగరాన్ని పంపుతున్నా.." అని చెప్పాడు. మరుసటి రోజు ఆమెకు ఫోన్ చేసి.. "వజ్రపుటుంగరానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి.. రూ.2.45 లక్షలు పంపితే మీ ఇంటికే నేను పంపిస్తోన్న బహుమతి వస్తుంది" అని చెప్పడంతో.. ఇంకేం ఆలోచించకుండా అతడు సూచించిన ఖాతాలో రూ.2.45 లక్షలు జమచేసింది. తన ఫియాన్సీ ప్రేమతో పంపిన బహుమతి ఎప్పుడెప్పుడు వస్తుందా...? అని ఆమె ఎదురుచూస్తోంది. పదిరోజులైనా ఉంగరం రాకపోవడంతో.. అతగాడికి ఫోన్ చేసింది. అందరూ ఊహించినట్టే.. ఆ నంబర్ స్విచ్ఛాఫ్. అప్పుడు ఆ యువవైద్యురాలికి పరిస్థితి అర్థమైంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
ఇంతకుముందు.. పోలీస్ అధికారులు, ఐఏఎస్‌ల ఫోటోలతో ఫేస్‌బుక్ ఖాతాలు, వాట్సాప్ డీపీలతో.. కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ సంస్థల ఉద్యోగులను బురిడీ కొట్టిస్తూ రూ.లక్షలు కాజేస్తున్న సైబర్‌నేరస్థులు ఇప్పుడు పంథా మార్చారు. కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతులు, వృత్తి నిపుణులను లక్ష్యంగా చేసుకుని స్నేహం.. పెళ్లి.. పేర్లతో గాలం వేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు ప్రెండ్ రిక్వెస్ట్ పంపించి.. రోజుల వ్యవధిలోనే చిరకాల మిత్రుల్లా మారిపోతున్నారు. తాము విదేశాల్లో ఉంటున్నామని... తమవద్దకు వస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉందామంటూ తీయని కబుర్లు చెబుతున్నారు. ఈ మాటలను స్పందించిన వెంటనే తమ మాయాజాలాన్ని ప్రదర్శించి రూ.లక్షలు కాజేస్తున్నారు.