MBBS Seat Fraud : ఇటీవల ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి నీట్ కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. సైబర్ దొంగలు దీన్నీ అవకాశంగా వాడుకుని దోచేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది.
ఎంబీబీఎస్ సీటు ఇస్తామని రూ.10 లక్షలు టోకరా - హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్
MBBS Seat Fraud : అమాయకులకు వల వేసి డబ్బులు దండుకునే సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేయడానికి పూనుకున్నారు. ఎంబీబీఎస్ సీట్ పేరుతో విద్యార్థుల నుంచి లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి అతని నుంచి రూ.10 లక్షలు దోచేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం..మలక్‌పేట్‌కు చెందిన వెన్నెల సాయి ఇటీవల నీట్ పరీక్ష రాశారు. 2.32లక్షల ర్యాంక్ వచ్చింది. పలు కౌన్సెలింగ్‌లు జరిగినా ఎంబీబీఎస్ సీటు రాలేదు. ఇదేక్రమంలో మంజునాథ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీకు సీటు కావాలంటే తనూజ అనే మహిళను సంప్రదించాలని నంబరు ఇచ్చాడు. బాధితుడు సంప్రదించారు. ఆమె బెంగళూరు రమ్మని చెప్పింది. అక్కడికి వెళ్లగా.. ఆమె కలిసి అక్కడి కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఇక్కడే మీకు సీటు ఇప్పించేది. అదీ కర్ణాటక ప్రభుత్వ సీటు అని చెప్పింది. అతడు నిజమని నమ్మి సీటు రిజర్వు చేయడానికి రూ.20వేలు కట్టాడు. తర్వాత సీటు అలాట్‌మెంట్‌కు రూ.20లక్షలు ఇవ్వాలని చెప్పింది. బాధితుడు రూ.10లక్షలు చెల్లించాడు. తరవాత ఆమె ఫోన్ పని చేయడం లేదు. బాధితుడు.. హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.