సైబర్ నేరాలు సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. కంప్యూటర్ వ్యవస్థను అతలాకుతలం చేసే రాన్సమ్‌వేర్‌కు కొనసాగింపుగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త ప్రక్రియకు తెరలేపారు. ‘సప్లై చైన్ ఎటాక్’ పేరుతో మొదలైన ఈ కొత్త దందా ఇప్పుడు ప్రపంచ వ్యాపార సంస్థలను వణికిస్తోంది.
ఇది ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికాలోని అనేక రాష్ట్రాలకు చమురు సరఫరా చేస్తున్న ‘కలోనియల్ పైప్‌లైన్’ సంస్థపై దాడి చేయడంతో ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడి ప్పుడే మన దేశంలోని అనేక సంస్థలూ ఈ కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఆపరేటింగ్ సిస్టం అసలైనదై ఉండాలని, ఉచితంగా ఇచ్చే యాంటీ వైరస్‌ను వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలానే సంస్థలైతే తమకు తాము ప్రత్యేక సైబర్ భద్రతా విధానాన్ని రూపొందించుకోవాలని చెబుతున్నారు.
ఏమిటీ ‘ఎటాక్’..
వన్నా క్రై పేరుతో 2017లో ప్రపంచవ్యాప్తంగా అనేక కంప్యూటర్లపై జరిగిన సైబర్ దాడి నేపథ్యంలో రాన్సమ్‌వేర్ గురించి జనాలకు తెలిసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు దాన్ని వాడుతున్న కంప్యూటర్లలోకి చొరబడి, వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. డబ్బే లక్ష్యం. దాదాపు నాలుగు రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లు దీని బారినపడ్డాయి. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
సరైన రక్షణ విధానం లేని కంప్యూటర్లు, ఫోన్లు వాడుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అశ్లీల సైట్లు చూసేవారు, ఉచితంగా దొరికే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారు కూడా ఇలాంటి వాటి బారినపడుతున్నారు.