తక్కువ పెట్టుబడులకు అధిక లాభాలిస్తామంటూ సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఎక్కడో ఒక చోట కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. అంతా అయ్యాక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన సురేశ్ యాదవ్ పెట్టుబడి పేరిట రూ.1.60 లక్షలు మోసపోయినట్లు తెలిపారు. ఓ మహిళ తనకు ఫోన్ చేసి... తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏ రోజు లాభాలు అదేరోజు ఇస్తామని చెప్పిందని బాధితుడు పేర్కొన్నారు. ఇందులో లెవల్-1, లెవెల్-2 ఉంటాయని... లాభాలను వివరించిందని తెలిపారు.
కేసు నమోదు
ఆమె మాయ మాటలు నమ్మిన బాధితుడు రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు వాపోయారు. ఆ తర్వాత తన ఫోన్ నంబరును బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.